ఎమ్మెల్యే అవ్వాలన్న తన కలను.. నటి రోజా.. గత ఎన్నికల్లో నెరవేర్చుకున్నారు. టీడీపీలో ఉన్నంత కాలం.. ఓ సారి నగరి నుంచి.. మరోసారి చంద్రగిరి నుంచి పోటీ చేసి పరాజయం పాలైన ఆమె.. వైసీపీలో చేరిన తర్వాత నగరి నుంచి.. అతి కష్టం మీద.. 858 ఓట్ల లోపు తేడాతో విజయం సాధించారు. దానికి కారణం.. ఆమె భర్త సెల్వమణి ప్రచారం చేయడం. గత ఎన్నికలకు ముందు సెల్వమణి.. శ్రీలంక తమిళుల విషయంలో… కాస్త హడావుడి చేశారు. అరెస్ట్ కూడా అయ్యారు. ఆ సానుభూతి ఓట్లు రోజాకు లభించాయి. దాంతో విజయం సునాయాసం అయింది. ఈ సారి ఆ తమిళుల ఓట్లు.. రోజాకు పడుతాయా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
ఈ నియోజకవర్గానికి తిరుగులేని నేతగా ఉన్న గాలి ముద్దుకృష్ణమనాయుడి తనయుడు భానుప్రకాష్‌కు చంద్రబాబు అవకాశం ఇచ్చారు. 2014 నుంచి నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాలు భానుప్రకాషే చూసుకుంటున్నారు. ముద్దుకృష్ణమనాయుడు చేసిన సేవలు, ఆయన లేరన్న సానుభూతి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయని .. భానుప్రకాష్ నమ్మకంగా ఉన్నారు. రోజా.. సంప్రదాయ ఓటు బ్యాంక్‌తో పాటు తమిళుల ఓట్లను పొందేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. పుత్తూరు, నగరి మున్సిపాలిటీల పరిధిలో సెల్వమణి సామాజిక వర్గం సింగుందర్ ఓట్లు అధికంగా ఉన్నాయి. అయితే ఈ ఐదేళ్ల కాలంలో రోజా.. నియోజకవర్గంలో చేసేందేమీ లేదు. కనీసం ప్రభుత్వ పథకాలు అయినా… ప్రజలకు అందించే ప్రయత్నం చేయలేదు. ప్రభుత్వం సహకరించలేదంటూ నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి చొరవ చూపలేదు. పైగా ఆమె అందరితోనూ… దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇవి ఆమెకు మైనస్‌గా మారుతోంది.
ఈ సారి తమిళ ఓటర్ల విషయంలో.. టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. డీఎంకే అధినేత స్టాలిన్, కమల్ హాసన్ వంటి వారు.. చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడుతున్నారు. స్టాలిన్‌తో .. చంద్రబాబు చిత్తూరు జిల్లాలో ఎన్నికల ప్రచారం చేయించుకునే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఒక వేళ స్టాలిన్ రాకపోయినా.. తమిళ ఓటర్లను.. టీడీపీ వైపు మళ్లించేందుకు డీఎంకే నేతలతో.. తెర వెనుక ప్రయత్నాలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితులన్నీ పరిగణనలోకి తీసుకుంటే… ఆర్కే రోజాకు.. ఈ సారి అంత తేలిక కాదన్న అభిప్రాయం ఏర్పడుతోంది.