తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని తెలిగాయగానే.. మన రాష్ట్రం కూడా ఏపీలా అవుతుందా అని బీఆర్ఎస్ నేతలు.. సానుభూతిపరులు ఆందోళన చెందడం ప్రారంభించారు. తెలంగాణ లో ఉన్న వారికి ఇది హాట్ టాపిక్ . అమ్మో మన రాష్ట్రం కూడా ఏపీలా అయిపోతే ఎలా అని అందరూ ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో వారికి ఓ క్లారిటీ ఉంది. ఏపీలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. అందుకే ఏపీ లా అవకూడదని.. కోరుకుంటున్నారు. ఇంత వరకూ ఓకే.. కానీ మరి ఏపీలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలంగాణ వారికి అర్థమవుతోంది.. మరి ఏపీ వాసులకు అర్థమవతుుందా అన్నదే ప్రశ్న.
ఏపీలో అత్యంత ఘోరమైన, దుర్మార్గమైన పాలన ఉంది. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని పూర్తిస్థాయిలో దుర్వినియోగం చేసి… అవినీతికి పాల్పడటం దగ్గర్నుంచి రాజకీయ ప్రత్యర్థుల్ని వేధించడం… పరిశ్రమల్ని తరిమేయడం.. ప్రజల్ని నిరుపేదలుగా చేసి ఓటు బ్యాంకుగా మార్చుకోవడం వరకూ అన్ని రకాల రాజకీయ ప్రయోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రం మరో బీహార్ అయింది. బీహార్ అన్నా కాస్త మెరుగుపడింది కానీ ఏపీ దిగజారిపోయింది.
ప్రజాధనం పెట్టి సొంత పార్టీ కార్యక్రమాలు చేసుకునే దౌర్భాగ్యమైన పాలన ఉంది. ప్రజాధనాన్ని నాశనం చేయడం.. సొంత రాజధానిని నిర్వీర్యం చేసుకోవడం.. ప్రజా ఆస్తుల్ని కూల్చివేయడం వంటివి చూశాకా అందరూ బాబోయే ఏపీ అనే పరిస్థితి వచ్చింది. అందుకే.. తెలంగాణలో ప్రభుత్వం మారుతుందంటే.. ఏపీలా అయిపోతుందా అని ఆందోళన చెందుతున్నారు. అలా ఆందోళన చెందిన వారిలో ఏపీ నుంచి వెళ్లి సెటిలైన వారు కూడా ఉన్నారు. ఇది కూడా అసలు మ్యాటర్.. ఇదంతా ఏపీ ప్రజలు అర్థం చేసుకుంటున్నారా అని.
ఏపీని బయట ఎలా చూస్తున్నారో.. ఎంత విధ్వంసానికి ప్రతిరూపంగా చూస్తున్నారో.. అక్కడి ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ఓటర్లను ఎంత స్వార్థ పూరితంగా లెక్కలేస్తున్నారో తెలుసుకుంటున్నారా లేదా అన్నదే అర్థం కాని అంశం . ఏపీలో తాము ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నామని తమను బెంచ్ మార్క్ గా పెట్టుకుని అలాంటి పరిస్థితి రాకూడదని అందరూ కోరుకుంటున్నారని ఏపీ ప్రజలు అర్థం చేసుకుంటారా… లేదా అన్నదే కీలకం.