తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విజయశాంతిని పార్టీలో చేర్చుకునేందుకు నిర్ణయించుకుంది. ఆమెతో చర్చలు జరిపి.. మెదక్ ఎంపీ టిక్కెట్ ఇస్తామని హామీ ఇచ్చి పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది. ఆమెతో చర్చలు పూర్తయ్యాయని రెండు రోజుల్లో కాంగ్రెస్ లో చేరతారని మల్లు రవి ప్రకటించారు. గత వారం, పది రోజుల నుంచి విజయశాంతి కాంగ్రెస్ తో టచ్లో ఉన్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఓ దశలో గజ్వేల్ లో టిక్కెట్ ఇచ్చిన నర్సారెడ్డిని పక్కన పెట్టి విజయశాంతిని కాంగ్రెస్ తరపున బరిలోకి నిలబెట్టాలన్న ఆలోచన కూడా చేశారని చెప్పుకున్నారు. కానీ వర్కవుట్ కాలేదు.
ఇప్పుడు ఎన్నికల కంటే ముందుగానే విజయశాంతికి పార్టీ కండువా కప్పనున్నారు. బీజేపీలో విజయశాంతి చేరారే కానీ ఆమెను పట్టించుకున్న వారు లేరు. ఇటీవలికాలంలో అయితే ఆమెను కనీసం స్టార్ క్యాంపెయినర్ గా కూడా నియమించలేదు. ఆమెతో పెద్దగా పని లేదనుకున్నారు. ఏ మాత్రం ప్రాధాన్యం ఇచ్చినా ఇంకా ప్రాధాన్యం ఇవ్వడం లేదని అలగడం ఆమె స్టైల్. తనను తాను ఎంతో ఊహించుకుని.. నేరుగా పీఠంపై కూర్చోబెట్టాలని అనుకుంటారన్న విమర్శలు ఉన్నాయి. పైగా ఆమెకు నిలకడతనం లేదు. ఎప్పుడు ఏ పార్టీ గాలి ఉందనుకుంటే ఆ పార్టీలో చేరిపోతారు.
మొదట బీజేపీలో చేరారు. తర్వాత సొంత పార్టీ పెట్టారు. బీఆర్ఎస్ లో విలీనం చేశారు. తెలంగాణ ఇచ్చారని కాంగ్రెస్ లో చేరారు. మళ్లీ బీజేపీలో చేరారు. మళ్లీ కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఎక్కడ ఉన్నా.. ఆమె మొత్తం అసంతృప్తిగానే ఉంటారు. కాంగ్రెస్ లో ప్రచార కమిటీ చైర్మన్ పదవి ఇచ్చినా ఆయనా అసంతృప్తితో బీజేపీలోకి వెళ్లారు. అక్కడ స్టార్ క్యాంపెయినర్ హోదా కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. తన రాజకీయ విలువల్ని విజయశాంతి పూర్తిగా కోల్పోతున్నారు. ఏ పార్టీ కూడా ఆమెను నమ్మలేని పరిస్థితి వస్తోంది.