బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసిన వీఆర్వో వ్యవస్థను రేవంత్ సర్కార్ తిరిగి తీసుకురానుందా? ఇందుకోసం ప్రభుత్వం కసరత్తు చేపట్టిందా..? అంటే అధికారిక వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది.
కేసీఆర్ హయాంలో తీసుకున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాలపై రేవంత్ సర్కార్ సమీక్ష చేస్తోంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ రద్దు చేసిన వీఆర్వో వ్యవస్థపై చర్చించిన ప్రభుత్వం.. మళ్లీ వీఆర్వో వ్యవస్థను తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read : మందకృష్ణ.. వాట్ నెక్స్ట్?
వీఆర్వో వ్యవస్థను బీఆర్ఎస్ రద్దు చేయడంతో గ్రామ స్థాయిలో చాలా సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. పంచాయితీ సెక్రటరీలపై అదనపు భారం పడుతుంది. దీంతో రెవెన్యూ సంబందిత సమస్యలు గ్రామ స్థాయిలో పరిష్కారానికి నోచుకోవడం లేదు.ఈ కారణంగా వీఆర్వో వ్యవస్థను తిరిగి తీసుకురావాలని ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం.
రెవెన్యూ వ్యవస్థ బలోపేతంపై దృష్టిపెట్టిన ప్రభుత్వం వీఆర్వోలను నియమిస్తే.. వారిని జేఆర్వోలుగా ( జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ ) గా పేరు మార్చాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. వీఆర్వో వ్యవస్థ రద్దుచేసిన సమయంలో వారిని నాడు ప్రభుత్వం వివిధ శాఖలో సర్దుబాటు చేసింది. వారిలో డిగ్రీ అర్హత ఉన్నవారిని ఈ పోస్తుల్లోకి తీసుకోవాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్ కు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందినట్లుగా తెలుస్తోంది.