ఆంధ్రప్రదేశ్ లో 2019 ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇంకొక సారి అధికారం నిలబెట్టుకోవడానికి చంద్రబాబు వ్యూహాలు రచిస్తుంటే, పార్టీ పెట్టిన తర్వాత మొదటి సారి పాల్గొన్న 2014 ఎన్నికలలో వెంట్రుక వాసిలో మిస్ అయింది కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పదవిని సాధించి తీరాలని జగన్ పట్టుదలగా ఉంటే, 2009లో ప్రజారాజ్యం సమయంలో సాధించలేక పోయిన రాజ్యాధికారాన్ని ఈసారైనా సాధించాలని, జనసేన పార్టీ ప్రమేయం లేకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొనసాగలేని పరిస్థితి సృష్టించాలని పవన్ కళ్యాణ్ తీవ్రంగా శ్రమిస్తున్నారు.
రాయలసీమ నుండి బాబు , జగన్, ఉత్తరాంధ్ర నుండి పవన్
అయితే చంద్రబాబు ఎప్పటిలాగానే చిత్తూరు జిల్లా కుప్పం నుండి పోటీ చేస్తుంటే, వైయస్ జగన్ క్రితంసారి లాగే కడప జిల్లా పులివెందుల నుండి పోటీ చేస్తున్నాడు. అయితే ఈ ఇద్దరు కూడా రాయలసీమ ప్రాంతం నుండి ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతుంటే, పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర, కోస్తా ఆంధ్ర ప్రాంతాల నుండి నామినేషన్ దాఖలు చేయనున్నారు. అయితే పవన్ కళ్యాణ్ వేస్తున్న ప్రతి అడుగూ కూడా వ్యూహాత్మకంగానే ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 1953 లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి, గత 66 సంవత్సరాలలో ఇప్పటిదాకా ఒక్కరు కూడా ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి ముఖ్యమంత్రి పదవి చేపట్టడం కానీ, ముఖ్యమంత్రి పదవికి పోటీ పడడం కానీ జరగలేదు. రాష్ట్రంలో ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబడి పోవడానికి బహుశా ఇది కూడా ఒక కారణం కావచ్చు. అయితే తమ ప్రాంతం నుండి ముఖ్యమంత్రులు వచ్చినంత మాత్రాన తమ ప్రాంతం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఏమీ లేదని రాయలసీమ ప్రాంతం నిరూపిస్తోంది. చంద్రబాబు , వైయస్ రాజశేఖర్ రెడ్డి, కోట్ల విజయ భాస్కర రెడ్డి లతో పాటు మరెందరో నాయకులు రాయలసీమ ప్రాంతం నుండి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. అయినా రాయలసీమ ప్రాంతం వెనకబడి ఉంది.
66 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన నాయకుల నియోజకవర్గాలు, జిల్లాలు:
ఇప్పటివరకు ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నాయకులు, వారు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాలు, ఆ నియోజకవర్గం ఉన్న జిల్లాలు ఈ విధంగా ఉన్నాయి.
68 నియోజకవర్గాలు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి పదవికి నోచుకోని ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర
పై లిస్టు ను చూస్తే, ఇప్పటివరకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల నుండి ప్రాతినిధ్యం వహించిన ఈ ఒక్క నాయకుడు కూడా ముఖ్యమంత్రి పదవి చేపట్టడం లేదని అర్థమవుతుంది. అయితే 1983 లో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నందమూరి తారక రామారావు గుడివాడ, తిరుపతి అనే రెండు నియోజకవర్గాల నుండి కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే గెలిచిన తర్వాత తిరుపతి నియోజకవర్గాన్ని అట్టి పెట్టుకుని గుడివాడ నియోజకవర్గాని కి రాజీనామా చేశారు.
శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం మరియు గోదావరి జిల్లాలకు చెందిన నాయకులు మాత్రం ఇప్పటిదాకా ముఖ్యమంత్రి పదవి చేపట్టలేదు. ఈ ఐదు జిల్లాల్లో కలిపి దాదాపు 68 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నప్పటికీ, ఈ ఐదు జిల్లాల్లో గాలి ఎటు వీస్తే ఆ పార్టీ లే ముఖ్యమంత్రి పదవిని చేపట్టినప్పటికీ, ఈ జిల్లాలకు చెందిన నాయకులు మాత్రం ఎవరు ముఖ్యమంత్రి కాలేకపోయారు.
ఉత్తరాంధ్ర సమస్యలపై గళమెత్తిన పవన్, ఆ ప్రాంతం నుండి తొలి ముఖ్యమంత్రి అవుతాడా?
శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం సమస్య, ఉత్తరాంధ్ర గిరిజనుల సమస్యలు, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సమస్య, తదితర సమస్యలపై బలంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే టికెట్ లు కేటాయించే టప్పుడు కూడా ఉద్దానం సమస్య పై, అలాంటి ఇతర సమస్యల పై పోరాడిన వారికి పెద్దపీట వేశారు. మరి ఉత్తరాంధ్ర ప్రజలు పవన్ ని ఆదరిస్తారా, తమ ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహించే నాయకున్ని ముఖ్యమంత్రిగా గెలిపించుకోగలుగూతారా అనేది తెలియాలంటే ఎన్నికలయ్యేదాకా వేచి చూడాలి!!