కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ ఎమ్మెల్యే పదవులపై సస్పెన్స్ కొనసాగుతోంది. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సమయంలో మండలి చైర్మన్ స్వామిగౌడ్‌పై హెడ్‌ఫోన్స్ విసిరి గాయపరిచారన్న కారణంతో.. వీరిపై అనర్హతా వేటు వేసేశారు. రాత్రికి రాత్రి వారి అసెంబ్లీ సెగ్మెంట్లు నల్లగొండ, ఆలంపూర్ ఖాళీ అయినట్లు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో కూడా ఓటు హక్కు వినియోగించుకోనివ్వలేదు. దీనిపై వారు హైకోర్టులో పిటిషన్ వేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్‌లపై అనర్హతా వేటు సరికాదని హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. దీంతో కేసీఆర్ ప్రభుత్వం చిక్కుల్లో ఇరుక్కున్నట్లయింది.
సింగిల్ బెంచ్ తీర్పుపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రివ్యూ పిటిషన్ వేశారు. వీరికి పిటిషన్ వేసే అర్హత లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఇప్పుడు మళ్లీ బంతి… తెలంగాణ ప్రభుత్వం వద్దకు చేరింది. సింగిల్ బెంచ్ తీర్పుపై … అసెంబ్లీ తరపున కోర్టుకు వెళితే.. తీర్పును అంగీకరించినట్లవుతుంది. దీని వల్ల చాలా సమస్యలు వస్తాయి. శాసన వ్యవస్థలో జోక్యం చేసుకునే అవకాశం నేరుగా.. అసెంబ్లీనే హైకోర్టుకు కల్పించినట్లవుతుంది. అందుకే ఈ పరిస్థితి రాకుండా.. అసెంబ్లీకి సంబంధం లేనట్లుగా ఎమ్మెల్యేలతో పిటిషన్ వేయించారు. దీన్ని కోర్టు తిరస్కరించడంతో ప్రత్యామ్నాయాలపై తెలంగాణ సర్కార్ దృష్టి పెట్టాల్సి ఉంది.
అసలు హైకోర్టు.. కోమటిరెడ్డి, సంపత్‌లపై అనర్హతా వేటు చెల్లదని తీర్పు ఇచ్చినప్పుడే ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టి.. హైకోర్టు తీర్పును తిరస్కరిస్తున్నట్లు తీర్మానం చేస్తారన్న ప్రచారం జరింది. ఇలా చేస్తే.. శాసన వ్యవస్థ అధికారాలను సంపూర్ణంగా వినియోగించుకున్నట్లు అవుతుంది. కానీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టుకు వెళతారు. సహజన్యాయ సూత్రాలకు విరుద్దంగా ఎమ్మెల్యేలపై వేటు వేశారన్న ప్రచారం జాతీయ స్థాయిలో జరుగుతుంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం వీలైనన్ని మార్గాల్లో తక్కువ డ్యామేజ్‌తో ఈ వ్యవహారం నుంచి బయటపడేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి.. అసెంబ్లీ తరపున హైకోర్టులో సింగిల్ బెంచ్ తీర్పుపై సవాల్ చేయించడం.. రెండు… ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి.. హైకోర్టు తీర్పును తిరస్కరిస్తున్నట్లు తీర్మానించడం.
కొసమెరుపేమిటంటే.. కొన్ని రోజుల కిందట కోమటిరెడ్డి వెంటకరెడ్డి పుట్టిన రోజు వచ్చింది. ఆ సందర్భంగా స్వయంగా.. కేసీఆర్ కోమటిరెడ్డిని ఎమ్మెల్యేగా సంబోధిస్తూ స్వయంగా సంతకం చేసి ఓ లేఖ పంపారు. దీన్ని చూపి.. తమను కేసీఆర్ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తున్నారని… కోమటిరెడ్డి ప్రచారం చేసేసుకుంటున్నారు. కానీ కేసీఆర్ మాత్రం ఏం జరిగినా సరే మళ్లీ కోమటిరెడ్డి, సంపత్‌లను అసెంబ్లీ గడప ఎక్కనీయకూడదన్న లక్ష్యంతో ఉన్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.