వైసీపీలో చేరికల వెల్లువ ఉందని చెప్పుకోవాలనుకుంటున్నారో.. లేక సినిమా ప్రపంచం అంతా తమ వైపే ఉందని… నిరూపించాలనుకుంటున్నారో కానీ.. జగన్మోహన్ రెడ్డి.. సినిమా వాళ్లు ఎవరు వస్తారంటే.. వారికి లోటస్పాండ్లో రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. చివరికి గతంలో తనను చెడామడా తిట్టేసి వెళ్లిపోయిన వాళ్లను కూడా.. బలవంతపు నవ్వు పులిమేసుకుని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా… జీవితారాజశేఖర్ దంపతులు, హేమ కూడా చేరారు. ఇటీవలి కాలంలో.. అంటే.. చేరిక ప్రభంజనం ప్రారంభమయిన తర్వాత.. సినిమా పరిశ్రమ నుంచి వచ్చిన చేరిన వారు చాలా మంది ఉన్నారు. వీరిలో ఒక్కరికంటే… ఒక్కరికైనా… ఏపీలో ఓటు హక్కు ఉందా.. అన్నది అనుమానమే.
ధర్టీ ఇయర్స్ ఫృధ్వీ… చాలా రోజుల నుంచి వైసీపీ కోసం పని చేస్తున్నారు. ఆయన తనతో పాటు.. మరికొంత మంది జూనియర్ ఆర్టిస్టులకు ఎక్కువ.. క్యారెక్టర్ ఆర్టిస్టులకు తక్కువ అన్న గుర్తింపు ఉన్న కొంత మందిని మూటగట్టుకుని.. వైసీపీలో చేర్పించారు. వారితో కలిసి.. ఇప్పుడు ప్రచారం చేస్తూ.. స్కిట్లు వేస్తున్నారు. ఇవి అప్పుడప్పుడు ఆన్ లైన్ లో వైరల్ అవుతున్నాయి. ఆయనకు తోడు కృష్ణుడు అనే క్యారెక్టర్ కూడా వైసీపీలో చేరింది. ఆ తర్వాత భానుచందర్, జయసుధ, దాసరి అరుణ్, మోహన్ బాబు, జీవిత రాజేశేఖర్, హేమ, అలీ.. ఇలా జాబితా కొంచెం పెద్దదే. ఇంత కాలం… జగన్ గురించి ఒక్క మంచి మాట మాట్లాడటానికి కూడా మనసు రాని వీళ్లంతా.. ఎందుకు పని గట్టుకుని పోయి… వైసీపీలో చేరుతున్నారనేది చాలా మందికి అర్థం కావడం లేదు.
వీరంతా… వైసీపీలో ఎందుకు చేరినా… వారి చేరిక వల్ల జగన్మోహన్ రెడ్డి ఏం ఆశిస్తున్నారనేది చాలా మందికి అర్థం కావడం లేదు. జీవిత రాజశేఖర్ లనే తీసుకుంటే… వారు ఎవరు పిలిస్తే.. ఎవరు అధికారంలో ఉంటే.. ఆ పార్టీలో చేరిపోయే పరిస్థితుల్లో ఉంటారు. వారికి హైదరాబాద్లో ఓ స్థలం కమర్షియల్ ఉపయోగానికి కన్వర్షన్ కావాల్సివచ్చి కాంగ్రెస్ లో చేరారు. ఆ పనైపోయింది. ఇప్పుడు అక్కడ ఓ బిల్డింగ్ కట్టి.. అద్దెకు ఇచ్చుకున్నారు. ఆ బిల్డింగ్ సమస్యలే మళ్లీ వైసీపీ వైపు దారి తీసేలా చేసి ఉంటాయి. ఎందుకంటే.. ఆమె నంది అవార్డుల కమిటీకి చైర్మన్ గా ఉండి.. టీడీపీలో చేరిపోవడానికి రెడీ అయ్యారు. పిలుపు వస్తుందేమో అనుకున్నారు. కానీ రాలేదు. ఇక హేమ అయితే.. ఓ తూర్పుగోదావరి జిల్లా మాజీ ఎంపీకి సన్నిహితురాలు. ఆమె జైసమైక్యాంధ్ర పార్టీ తరపున పోటీ చేశారు కూడా.