తెలంగాణ జన సమితి పేరుతో కె. కోదండరామ్ కొత్తగా పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. దాని విధివిధానాలు, జెండా అజెండాలను కూడా ప్రకటించారు. ప్రస్తుత రాజకీయాల్లో కొత్త పార్టీకి అవకాశం ఉంటుందా..? ఈ పరిస్థితుల్లో టి.జె.ఎస్.లో చేరేవారు ఎవరు..? ఇతర పార్టీల నాయకులకు ఆకర్షించగలిగే శక్తి కోదండరామ్ కి ఉంటుందా..? ఇలాంటి అంశాలపై ఇప్పుడు రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే, తాజాగా ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో కోదండరామ్ మాట్లాడుతూ… తమ పార్టీలోకి చేరేందుకు చాలామంది నాయకులు ఆసక్తి చూపుతున్నారన్నారు.
తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్న చాలామంది ఉన్నారనీ, వారందరికీ సరైన స్థానం లేదని భావిస్తున్నారని కోదండరామ్ అన్నారు. అలాంటివాళ్లు తమవైపు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇది వాస్తవం అని ఆయన చెప్పారు. ఉద్యమకారులకు అక్కడ (తెరాసలో) అవకాశం ఉండదనేది స్పష్టంగా ఉందనీ, కాబట్టి తమ వెంట నడిచేవారు త్వరలోనే వస్తారనే ధీమా వ్యక్తం చేశారు. అయితే, రాజకీయంగా చూసుకుంటే… తెలంగాణలో రెండో ప్రత్యామ్నాయ శక్తిగా కాంగ్రెస్ కనిపిస్తోంది. తెరాసలో అసంతృప్తిగా ఉన్నారు, అవకాశం లభించదని అనుకునేవారు సహజంగానే కాంగ్రెస్ పార్టీవైపే చూస్తున్నారు. రేవంత్ రెడ్డిగానీ, నాగం జనార్థన్ రెడ్డిగానీ.. ఇటీవల కాలంలో ఇలా వలసలు కాంగ్రెస్ వైపే ఉన్నాయి. కాబట్టి, కోదండరామ్ పార్టీలోకి ఇప్పటికిప్పుడే ఇబ్బడిముబ్బడిగా నాయకులు వచ్చి చేరిపోయే అవకాశం అంతగా కనిపించడం లేదు. కోదండరామ్ పార్టీ పెట్టినా, అది కాంగ్రెస్ కు అనుకూలమైనదే అనే అభిప్రాయం కూడా ప్రచారంలో ఉంది. ఇతర పార్టీల నుంచీ, మరీ ముఖ్యంగా తెరాస నుంచి అనూహ్యంగా జన సమితిలోకి వలసలు ఉండే పరిస్థితి ప్రస్తుతం కనిపించడం లేదు.
పోనీ, సొంతంగా బలీయమైన శక్తిగా తెలంగాణ జన సమితి కనిపించినా.. ఇతర పార్టీల్లోని కొంతమందిని ఆకర్షించే అవకాశం ఉండేది! ఉద్యోగ సంఘాలే తమ బలమని చెప్పుకుంటున్నా… తెలంగాణ ఉద్యమ సమయంలో ఉన్న ఉద్యోగ సంఘాలు ఇప్పటి జేయేసీతో లేవు. టీఎన్జీవో, ఆర్టీసీ ఉద్యోగ సంఘం వంటివి సకల జనుల సమ్మె వంటి కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించాయి. ఇలాంటివారు ఇప్పుడు టీజేయేసీలో లేరు. కాబట్టి, సొంతంగా తెలంగాణ జన సమితి నిలదొక్కుకునేందుకు కొంత సమయం పట్టొచ్చు. ఈ క్రమంలో ఇతర పార్టీల నుంచి వచ్చినవారిని చేర్చుకునేందుకు కూడా జన సమితి సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తోంది. కానీ, ఇతర పార్టీల నుంచి నేతలు వచ్చి చేరితే.. తక్షణ ప్రయోజనంగా ఆ నాయకుల కేడర్ ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో సదరు నేతల పట్ల ప్రజల్లో ఉన్న సానుకూల ప్రతికూల ప్రభావాల ముద్ర తెలంగాణ జన సమితిపై కూడా పడుతుంది. సో.. కోదండరామ్ ఆశిస్తున్నట్టు ఇతర పార్టీల నుంచి వచ్చేవారు ఎవరై ఉంటారనేది వేచి చూడాలి.