తెలంగాణ రాష్ట్ర సమితి ట్విట్టర్ ట్రెండింగ్లను గొప్పగా చెప్పుకుంటోంది. అయితే టీఆర్ఎస్కు పాజిటివ్ లేకపోతే.. ఇతరులకు నెగెటివ్‌గా ట్రెడింగ్ చేసి.. ఇదిగో హ్యాగ్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉందని మీడియాకు చెప్పుకుని.. సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుని హడావుడి చేస్తున్నారు. తాజాగా తెలంగాణ అర్థిక వృద్ధిలో సూపర్ అంటూ కేంద్రం ఇచ్చిన నివేదికలతో మరో సారి ట్విట్టర్ ట్రెండింగ్ అస్త్రాన్ని టీఆర్ఎస్ ప్రయోగించింది.
#TriumphantTelangana.. #ThankYouKCR హ్యాష్ ట్యాగ్ లతో ట్విట్టర్ లో టీఆర్ఎస్ నేతలు పోస్టులు చేశారు . 50 వేలకు పైగా ట్వీట్లు చేశారు. ఈ యాభై వేల ట్వీట్లలో విదేశీయులు కూడా ఉన్నారు. వారు కూడా తెలంగాణ అభివృద్ధిని పొగిడారు. కేసీఆర్ నాయకత్వ పటిమను అభినందించారు. వారికేం సంబంధం అని మనం అనుకోవచ్చు కానీ ట్విట్టర్ ట్రెండింగ్‌లు అంటే అంతే ఉంటాయ్ మరి.!. తెలంగాణ అభివృద్ధి సాధిస్తోంది అన్నది నిజమే. ..కానీ ట్రెండింగ్ ప్రచారాల వల్ల ఇంతా ప్రచారమే అన్న ఓ భావన ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది.
ట్విట్టర్లో పని గట్టుకుని ట్వీట్లు, హ్యాష్ ట్యాగ్లు పెట్టి ప్రచారం చేయడం వల్ల కృత్రిమంగా ట్రెండింగ్ అవుతుంది. అది జనంలో వచ్చే ఎమోషన్ కాదు. కానీ టీఆర్ఎస్ ఆన్లైన్ ప్రచార కర్తలు ఇటీవలి కాలంలో ఇలాంటి కృత్రిమ ట్రెండింగ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. రైతు బంధు దగ్గర నుంచి ప్రతీ దానికి ట్రెండింగ్ బాట పడుతున్నారు. తమ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకు పని పెడుతున్నారు . ఇది ఎబ్బెట్టు అవుతుందని గుర్తిస్తారో లేదో మరి !