వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు షర్మిల ఫిక్స్ అయినట్లుగా కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నప్పటికీ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసత్వం పార్టీలోకి మళ్లీ వస్తానంటే వద్దనడం కరెక్ట్ కాదని.. ఆమెకు పాలేరు అసెంబ్లీ సీటు కేటాయిస్తే పోయేదేముందని హైకమాండ్ చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. దానికి తగ్గట్లుగానే పరిమామాలు వేగంగా జరుగుతున్నాయి.
షర్మిల గతంలో గాంధీ కుటుంబంపై తీవ్ర విమర్శలు చేశారు. ఓ సందర్భంగా తమ తండ్రి వైఎస్ మరణం వెనుక సోనియా గాంధీ కుట్ర ఉందన్న ఆరోపణలు కూడా చేశారు. అదే ఆరోపణలతో జగన్ ఎన్నికల్లో పోటీ చేస్తే అందరూ అదే కోరస్ వినిపించారు. అప్పట్నుంచి ఎప్పుడూ ఆ గాంధీలను పొగడలేదు.. శుభాకాంక్షలు చెప్పలేదు. పైగా రాహుల్ గాంధీని కించ పరిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈ సారి రాహుల్ గాంధీ పుట్టిన రోజును.. హృదయపూర్వక శుభాకాంక్షలు చెబుతూ.. ట్వీట్ చేశారు. ఆమె ట్వీట్ చూసి తెలంగాణలో అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది.
అయితే షర్మిలను కాంగ్రెస్ లో చేర్చుకున్నా.. ఇవాళ కాకపోతే.. రేపు తెలంగాణ ఎన్నికల తర్వాతైనా ఏపీకి పంపడం ఖాయమన్న ప్రచారం మాత్రం ఇప్పటికే జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ కు మళ్లీ పూర్వ వైభవం రావాలంటే… షర్మిల వల్లే సాధ్యమని… వైఎస్ కుటుంబంతో పోయిన ఓటు బ్యాంక్ మళ్లీ ఆకుటుంబంతోనే వెనక్కి తెచ్చుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి షర్మిల ఏదో సంచలన నిర్ణయమే తీసుకోబోతున్న సూచనలు కనిపిస్తున్నాయని ఇవాళ సంకేతాలు ఇచ్చారు.