వైసీపీకి చెందిన పదకొండు మంది రాజ్యసభ ఎంపీల్లో ఆరేడుగురు రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని సాక్షి పత్రికే తనదైన కోణంలో బయట పెట్టింది. వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసి టీడీపీలో చేరబోతున్నారని వారికి మళ్లీ టీడీపీ అదే రాజ్యసభ సభ్యత్వం ఇస్తుందని సాక్షి పత్రికలో ప్రత్యేకంగా రాశారు. దీనికి తనదైన శైలిలో కొనుగోళ్లు.. చంద్రబాబు బేరాలు అని దీర్ఘాలు తీసినప్పటికీ.. అసలు విషయం మాత్రం సూటిగానే చెప్పేసింది.
టీడీపీకి ప్రస్తుతం రాజ్యసభ సభ్యలు లేరు. మరో ఏడాదిన్నర తర్వాత రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలు వస్తాయి. అప్పటి వరకూ ఎందుకు.. ఇప్పుడే వైసీపీ ఎంపీలతో రాజీనామా చేయిస్తే.. ఉపఎన్నికలు వస్తాయన్న ఆలోచనకు వస్తున్నారు. ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ సీట్లు లాంటి ప దవుల్లో ఒక్కటి కూడా వైసీపీకి వచ్చే అవకాశాలు లేవు. అందుకే పదవి కాలం పూర్తయిన తర్వాత రాజ్యసభ సభ్యత్వం కాకపోయినా మరో పదవి వస్తుందన్న ఉద్దేశంతో వైసీపీ రాజ్యసభ సభ్యులు టీడీపీ వైపు చూస్తున్నట్లుగా చెబుతున్నారు.
Read Also : ఆ ఇద్దరు వైసీపీ ఎంపీల దారెటు..?
ఇప్పటికే ఒడిషాలో ఓ బీజేడీ ఎంపీ రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అక్కడ బీజేపీ అధికారంలో ఉండటంతో ఆ స్థానం నుంచి బీజేపీ తరపున ఆమెను రాజ్యసభకు పంపనున్నారు. అదే వ్యూహంలో ఇక్కడ వైసీపీ ఎంపీలతో రాజీనామాలు చేయించి .. వారిని టీడీపీ తరపున నిలబెట్టి మళ్లీ వారి పదవుల్ని వారికే ఇచ్చే అవకాశం ఉంది. అప్పుడు వారి అధికారికంగా టీడీపీ కూటమి రాజ్యసభ సభ్యులు అవుతారు.
నిజానికి గతంలో ఎమ్మెల్సీల విషయంలో జగన్ ఇదే ఫార్ములా ప్రయోగించారు. డొక్కా మాణిక్యవరప్రసాద్ ను రాజీనామా చేయించి పార్టీలో చేర్చుకుని మళ్లీ అదే పదవిని మిగిలిన కాలానికి ఆయనకు ఇచ్చారు. ఇప్పుడు అదే ఫార్ములాను చంద్రబాబు రాజ్యసభ సభ్యుల విషయంలో అడాప్ట్ చేసుకోనున్నట్లుగా తెలుస్తోంది.