వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లుగా లోక్ సభలో వైసీపీ ప్రకటించింది. అక్కడ వారు వ్యతిరేకించినా … అనుకూలించినా పెద్ద తేడా లేదు. ఎందుకంటే ఎన్డీఏకు పూర్తి మెజార్టీ ఉంది. కానీ రాజ్యసభలో కూడా వైసీపీ వ్యతిరేకించాల్సి ఉంది. అక్కడ ఎన్డీఏకు మెజార్టీ లేదు. వైసీపీ, బీజేడీలకు చెందిన ఎంపీలే కీలకం. ఇప్పుడు ఈ రెండు పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయి. వక్ఫ్ బిల్లునూ వ్యతిరేకిస్తున్నాయి.
గతంలో ఈ రెండు పార్టీలు నిర్మోహమాటంగా బీజేపీకే మద్దతు తెలిపేవి. అలా చేసి.. ఒడిషాలో నవీన్ పట్నాయక్ సీటును కోల్పోయారు. దీంతో ఇప్పుడు బీజేపీకి ఏ కోశానా మద్దతిచ్చే అవకాశం లేదని అంటున్నారు. వైసీపీ పరిస్థితి ఎటు పోయిందో చెప్పాల్సిన పని లేదు. కానీ ఆ పార్టీకి రాజ్యసభ సభ్యులున్నారు. అనుకూలంగా ఉంటే సిగ్గులేదా అని జనం అంటారని భయం.. వ్యతిరేకిస్తే జరగబోయే పరిణామాల్ని తట్టుకోలేమని కంగారు వారికి ఉన్నాయి.
లోక్ సభ వరకూ వారు వక్ఫ్ బిల్లును వ్యతిరేకించారు. ప్రభుత్వం జేపీసీకి బిల్లును పంపింది. తర్వాత అయినా ఓటింగ్ కు రావాల్సిందే. అప్పుడు రాజ్యసభలో వైసీపీ ఏ స్టాండ్ తీసుకుంటుందన్నది కీలకం. వారికి కావాల్సింది కేసుల నుంచి రక్షణ. అది కల్పిస్తే… మద్దతిస్తారు. ఎవరేమని అనుకున్నా పట్టించుకోరు అలాంటి హామీ లభిస్తే.. నేరుగా రాజ్యసభ సభ్యుల్నే బీజేపీలోకి పంపే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఎలా చూసినా అడ్డగోలు రాజకీయంతో అయినా వక్ఫ్ బిల్లుకు రాజ్యసభలో వైసీపీ సపోర్టు ఖాయమని ఎక్కువ మంది నమ్ముతున్నారు.