తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి శత్రువులు ఎక్కడో ఉండరు. సొంత పార్టీలోనే ఉంటారు. పార్టీలో ప్రత్యర్థుల్ని ఇరికించడానికి అంటూ.. చేసే పనుల వల్ల సొంత పార్టీని టార్గెట్ చేస్తారు. చివరికి అది మొత్తం పార్టీకి ఇబ్బందికరంగా మారుతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మరికొంత మంది కోవర్టులంటూ.. కొంత కాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అది రేవంత్ రెడ్డే చేయిస్తున్నారని సీనియర్లు ఆనుమానించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓ అడుగు ముందుకేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇది జరిగి మూడు నెలలు అయింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం బంజారాహిల్స్ లో ఓ ఫ్లాట్లో సోషల్ మీడియా విభాగం వార్ రూమ్ నిర్వహిస్తోంది. ప్రభుత్వంపై వ్యతిరేక పోస్టర్లు తయారు చేయడం .. వాటిని వైరల్ చేయడం.. ప్రియాంకా గాంధీ ఇచ్చిన యూత్ డిక్లరేషన్ వంటి అంశాలను హైలెట్ చేస్తూ ప్రచారం చేయడం చేస్తున్నారు. వెంటనే పోలీసులు దాడి చేసి.. ఆ వార్ రూంలో ఉన్న ల్యాప్ ట్యాప్ లన్నీ పట్టుకుపోయారు. ఎందుకంటే.. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదును సాకుగా చూపించారు.
అంతకు ముందు కూడా కాంగ్రెస్ వార్ రూమ్ పై అదీ కూడా సునీల్ కనుగోలు బృందం పని చేస్తున్న ఆఫీసులో దాడులు చేసి కంప్యూటర్లన్నీ పోలీసులు ఎత్తుకుపోయారు. అయితే అప్పట్లో తెలంగాణ పోలీసులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు. అప్పుడే ఉత్తమ్ కు.. కోమటిరెడ్డికి వ్యతిరేకంగా కూడా పోస్టులు తయారు చేస్తున్నారని పోలీసులు చెప్పడం వివాదాస్పదం అయింది.
చివరికి ఇప్పుడు కాంగ్రెస్ సోషల్ మీడియా మొత్తాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ఫిర్యాదుతో ఇరికించేశారు. ఎక్కడ సోషల్ మీడియా ఆఫీసు పెట్టుకున్నా పోలీసులు ఇదే కారణంతో ఎటాక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.