తెలంగాణ సర్కార్ మహిళలకు కల్పిస్తోన్న ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. ఈ క్రమంలోనే మహిళా కమిషన్ కేటీఆర్ పై సీరియస్ అయింది.
ఆర్టీసీ బస్సులో బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోండి తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద.
కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని , దీనిపై విచారణ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు మహిళలను అవమానించేలా ఉన్నాయంటూ పేర్కొనగా.. ఈ వివాదానికి సంబంధించి ఆయనకు నోటీసులు ఇచ్చి వివరణ కోరే అవకాశం ఉంది.
అత్యుత్సాహంతో చేసిన ఈ వ్యాఖ్యలపై మహిళా లోకం నుంచి తీవ్ర విమర్శలు రావడంతో ఇదేదో బూమ్ రాంగ్ అయ్యేలా ఉందని భయపడిన కేటీఆర్.. ట్విట్టర్ వేదికగా క్షమాపణలు కోరారు.
పార్టీ సమావేశంలో యాదాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరీమణులకు మనస్థాపం కలిగితే విచారం వ్యక్తం చేస్తున్నాను. నా అక్కా చెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.