ఆర్టీసీ బస్సుల్లో మహిళల కోసం కొన్ని సీట్లను ప్రత్యేకంగా కేటాయిస్తారు. హైదరాబాద్ మెట్రో ట్రైన్లో మహిళల కోసం ప్రత్యేకంగా ఓ కోచ్ ఏర్పాటు చేశారు. అదే విధంగా మహిళలు తమ వాహనాలను పార్క్ చేయడం కోసం చెన్నైలో కొత్త ప్రారంభమైన ఈవిపి కార్నివాల్ సినిమాస్ మల్టీప్లెక్స్ యాజమాన్యం పార్కింగ్ ఏరియాలో కొంత స్థలాన్ని కేటాయించింది. దానికి `పింక్ పార్కింగ్` అని పేరు పెట్టింది. పార్కింగులో మహిళలకు రిజర్వేషన్ కల్పించడం అన్నమాట. ఇప్పటివరకూ ఏ షాపింగ్ మాల్లోనూ, మల్టీప్లెక్స్‌లోనూ ఇటువంటి రూల్ లేదు. మల్టీప్లెక్స్ పార్కింగ్ ఏరియాలో మహిళలకు ప్రత్యేకంగా కొంత ఏరియా కేటాయించడం ఇదే తొలిసారి. దీనికి స్పందన బావుంటే మిగతా మల్టీప్లెక్స్‌లు అనుసరించినా ఆశ్చర్యపోనవసరం లేదు. పోను పోనూ థియేటర్ టికెట్లలోనూ మహిళలకు రిజర్వేషన్లు వస్తాయేమో!