అమరావతికి రూ. పదిహేను వేల కోట్లు ఇస్తామని కేంద్రం ప్రకటించింది. చంద్రబాబు వేగంగా స్పందించి .. ప్రపంచ బ్యాంకు బృందాన్ని అమరావతికి రప్పించారు. ప్రపంచ బ్యాంక్ బృందం అమరావతిలో విస్తృత పర్యటనలు జరుపుతోంది రాజధాని పరిధిలో కట్టడాలు, ఇతర నిర్మాణాలు, ప్రస్తుత స్థితిని క్షేత్రస్థాయిలో ప్రపంచ బ్యాంక్ బృందం పరిశీలించింది. తర్వాత అమరావతి కావాల్సిన రుణంపై చర్చలు కూడా జరిపారు.
2050 నాటికి అమరావతి నగరంలో 3.5 మిలియన్ ప్రజలు ఉంటారని, వారికి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన ప్రాజెక్టులకు సాయం చేయాలని సీఆర్డీఏ బృందం ప్రపంచ బ్యాంక్ ముందు ప్రతిపాదనలు పెట్టింది. ముఖ్యంగా రోడ్లు, యుటిలిటీ కారిడార్లు, సీవరేజీ, విలేజ్రోడ్లు, కనెక్టివిటీ, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరద ముంపు నివారణ కాలువల మెరుగుదల చేసేందుకు అవసరమైన నిధులు రుణంగా ఇవ్వాలని ప్రపంచబ్యాంకు ప్రతినిధులను కోరారు. దీనికోసం కనీసం రూ.40 వేల కోట్ల అవసరం ఉందని, తాత్కాలికంగా రూ.15 వేల కోట్లు ఏర్పాటు చేస్తే వెసలుబాటుగా ఉంటుందని నివేదిక సమర్పించారు
రాయపూడిలో భవనాలు, హైకోర్టు పరిసరాలు, నిలిచిపోయిన నిర్మాణాలను ప్రపంచ బ్యాంక్ ప్రతినిధి బృందానికి చూపించారు. గతంలో పర్యావరణ ప్రభావం పర్యావరణ సామాజిక నిర్వహణ ఫ్రేమ్వర్కు కూడా పూర్తి చేసినందున ఇప్పుడు కొత్తగా చేయాల్సిన అవసరం ఉండదని అధికారులు చెప్పారు. ఆదివారం కూడా వారి పరిశీలన జరుగుతుంది. ప్రపంచబ్యాంక్ రుణానికి కేంద్రం గ్యారంటీగా ఉంటుంది. కాబట్టి.. వెంటనే మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.