వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ల ఖరారు కసరత్తును వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకా ప్రారంభించలేదు. కానీ ఏ ఏ స్థానాల్లో ఎవరు ఎవరు అభ్యర్థులు అన్న విషయంపై ఆ పార్టీ అధినేత ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు. అంత కంటే మెరుగైన అభ్యర్థులు దొరికితే తప్ప వారినే ఖరారు చేసే అవకాశం ఉంది. ఇలా టిక్కెట్లు ఖరారు కాని నేతల్లో ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి ఒకరు. జగన్కు సమీప బంధువు అయినా వై.వి.సుబ్బారెడ్డి ఈ సారి పార్టీ కార్యక్రమాలకే పరిమితమవుతారని ఏడాది కిందటే జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ విషయం వైసీపీ వర్గాలకు తెలుసు. ఈ సారి టీడీపీ నుంచి వచ్చి చేరుతారని భావిస్తున్న మాగుంట శ్రీనివాసులరెడ్డి ఒంగోలు నుంచి పోటీ చేస్తారని … చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. మాగుంటను పార్టీలోకి తీసుకునేందుకు విజయసాయిరెడ్డి చాలా తీవ్రమైన ఒత్తిడే తీసుకువచ్చారు.
కానీ ఆయన అటూ ఇటూ కాకుండా మధ్యలో ఉండిపోయారు. అయితే మొగ్గు వైసీపీ వైపే ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో వై.వి.సుబ్బారెడ్డి ఒక్క సారిగా బ్లాస్టయిపోయారు. తన సిట్టింగ్ సీటు నుంచి తానే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఇప్పుడే కాదు వచ్చే ఎన్నికల్లోనూ తాను ఒంగోలు ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. ఓడిపోయిన అభ్యర్థులను చేర్చుకుని వాళ్లను గెలిపించుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. వైసీపీకి కొత్త నాయకులు అవసరం లేదని ఫైరయ్యారు. మాగుంట శ్రీనివాసరెడ్డి వైసీపీలో చేరితే ఆయన సేవలను వినియోగించుకుంటాం కానీ టిక్కెట్ ఇవ్వబోమని తేల్చి చెప్పారు.
ఓ వైపు ఆయన వస్తే రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించాలనుకుంటున్న వైసీపీ అధినేతకు వై.వి.సుబ్బారెడ్డి షాక్ ఇస్తున్నారు. తనను కాదంటే తిరుగుబాటుకు సిద్ధమన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉండటంతో వైసీపీలో కాక రేపేదే. కొసమెరుపేమిటంటే.. ఈ సారి జగన్ కుటుంబం నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్న జగన్ సోదరి షర్మిల పేరు కూడా ఒంగోలు పార్లమెంట్ సీటుకు పోటీ చేస్తారన్న ప్రచారం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది.