వందల మంది ప్రాణాలు బలిగొన్న 1993 ముంబాయి బాంబు పేలుళ్ల మారణకాండలో కీలక నేరస్థుడు యాకూబ్ మెమన్ ను ఈనెల 30న ఉరి తీయనున్నట్లు మహారాష్ట్ర లోని నాగ్ పూర్ సెంట్రల్ జైలు వర్గాలు తెలిపాయి. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం పక్కా స్కెచ్ వేసి, డబ్బులు, బాంబులు సమకూర్చి ఈ పేలుళ్లు జరిపించాడు. దావూద్ ముఖ్య అనుచరుడు టైగర్ మెమన్, అతడి తమ్ముడు యాకూబ్ మెమన్ తోపాటు అనేక మంది ఉగ్రవాదులు ఈ నరమేధం సృష్టించారు. 1993 మార్చి 12న మధ్యాహ్నం మూడు గంటల పాటు బొంబాయి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. మధ్యాహ్నం 1.30కి బొంబాయి స్టాక్ ఎక్సేంజి భవనం బేస్ మెంట్లోని కారులో మొదటి బాంబు పేలింది. ఆ తర్వాత ఎయిరిండియా భవన్, సహర్ ఎయిర్ పోర్ట్, జవేరి బజార్, ప్లాజా సినిమా సహా మొత్తం 13 చోట్ల 13 బాంబులు పేలాయి. ఆనాటి మారణకాండలో 257 మంది అమాయకుడు ప్రాణాలు కోల్పోయారు.
ఈ దారుణ ఘటనపై సీబీఐ దర్యాప్తు జరిపింది. నేపాల్ కు పారిపోయిన యాకూబ్ మెమన్ ను ఖాట్మండు ఎయిర్ పోర్టులో అక్కడి పోలీసులు అరెస్టు చేసి భారత్ కు అప్పగించారు. టైగర్ మెమన్ మాత్రం ఇప్పటికీ దొరకలేదు. టాడా ప్రత్యేక కోర్టు యాకూబ్ మెమన్ కు మరణశిక్ష విధించింది. దీనిని సుప్రీం కోర్టు సమర్థించింది. ఇటీవల యాకూబ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. దీంతో ఈనెల 30న అతడిని ఉరితీయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు నాగ్ పూర్ జైలు వర్గాలు తెలిపాయి.
బొంబాయి పేలుళ్ల కేసులో సినీ నటుడు సంజయ్ దత్ కూడా నిందితుడే. పేలుళ్ల కుట్రలో పాత్రధారి కాకపోయినా, మెమన్ మనుషులు ఇచ్చిన ఏకే 56 రైఫిల్ ను దాచుకున్నాడు. తర్వాత దాన్ని ధ్వంసం చేయించాడు. అక్రమంగా ఆయధం కలిగి ఉండటం, నేరస్థులతో సంబంధాలు పెట్టుకోవడం అనే అభియోగాలపై సంజయ్ దత్ కు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. ప్రస్తుతం ఎరవాడ జైల్లో శిక్షను అనుభవిస్తున్నాడు.
బొంబాయి పేలుళ్ల ఘటనలో కీలక పాత్రధారి యాకూబ్ ను ఉరితీయాలంటూ, ఆనాటి మారణకాండలో మరణించిన వారి కుటుంబ సభ్యులు చాలా కాలంగా కోరుతున్నారు. పిటిషన్లు, స్టేలంటూ జాప్యం చేయవద్దని, అలాంటి రాక్షసుడికి ఉరే సరైందంటూ, ఉరి శిక్ష అమలయ్యే రోజు కోసం ఎదురు చూస్తున్నారు.