ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు. రాష్ట్ర ఆదాయ వ్యయాల మధ్య భారీ అంతరాలు నెలకొన్నాయని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ పటిష్టతను చెప్పేందుకు ఆరు సూచీలు ఉంటాయనీ, వాటిల్లో ఒక్కటి మాత్రమే అనుకూలంగా ఉందనీ, మిగతా ఐదూ సుచీలూ ప్రతికూలంగానే ఉన్నాయని అన్నారు. తొలి త్రైమాసికంపై సమీక్ష నిర్వహించిన అనంతరం ఈ విషయాలను యనమల మీడియాకు చెప్పారు. ఈ ఏడాతి తొలి త్రైమాసికంలోనే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామనీ, గతంలో నిలిపేసిన బిల్లులన్నీ ఒకేసారి చెల్లించాల్సి రావడమే కారణమని వివరించారు. పాత బకాయిలతో కలిపి ఈ త్రైమాసికంలో రూ. 49 వేల కోట్లను చెల్లించామనీ, ఈ నెలాఖరకు మరో రూ. 10 వేల కోట్లు బిల్లులు పెండింగ్ లో పడతాయని యనమల స్పష్టం చేశారు. రాష్ట్ర ఆదాయం ఆశించిన స్థాయిలో ఉండటం లేదనీ, ఇదే తరుణంలో ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయని చెప్పారు. ఈ పరిస్థితి మరో త్రైమాసికం కొనసాగితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత ఇబ్బందుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
నిజానికి, గతంలో కూడా ఇదే మాట చెప్పారు! ఖర్చులు తగ్గించుకోవాలంటూ అందరికీ సలహాలు ఇచ్చారు కూడా! ఇప్పుడు కూడా అదే పనిచేస్తున్నారు. కాకపోతే… ఈసారి ప్రభుత్వ శాఖలకు క్లాస్ తీసుకున్నారు. శాఖలవారీగా నిధులు కేటాయించినా.. అంతమించి నిధులను అడగడం సరికాదని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం కేటాయించిన నిధులతోనే సర్దుకోవాలనీ, ప్రాధాన్యతలను సమీక్షించుకుని ఖర్చుల్ని తగ్గించుకోవాలన్నారు. కొన్ని శాఖలవారు తమకు కేటాయించిన నిధుల్నీ పీడీ ఖాతాల్లో ఉంచుతున్నారనీ, ఈ పద్ధతిని మార్చుకోవాలన్నారు. అదనంగా నిధులు కావాలని ఎవ్వరూ అడగొద్దనీ, ఆ శాఖల్లోనే సర్దుబాట్లు చూసుకోవాలన్నారు.
ప్రతీ త్రైమాసికంలో ఇదే తంతు! ప్రభుత్వ శాఖలు ఖర్చులు తగ్గించుకోవాలనీ.. ప్రాధాన్యతలు మార్చుకోవాలని చెబుతారు. కానీ, తాము అనుసరిస్తున్న పొదుపు మార్గాల గురించి మాత్రం చెప్పరు. ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారానికి భారీ ఎత్తున ఖర్చు చేస్తుంటారు! సభలకీ సమావేశాలకీ భారీ ఖర్చులు చేస్తుంటారు. ఇక, ముఖ్యమంత్రి చంద్రబాబు ఖర్చు వెచ్చాలపై చాలా విమర్శలే ఉన్నాయి. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇవన్నీ తగ్గించుకోవాలి కదా! అయితే, ఆర్థిక పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా.. వృద్ధి రేటు మాత్రం అద్భుతంగా ఉందని యనమల చెప్పడం విశేషం! అంటే, రాష్ట్రం దూసుకుపోతోందని ఈ వృద్ధి రేటును బయట ప్రపంచానికి చూపిస్తున్నా… వాస్తవాలు వేరుగా ఉన్నాయని చంద్రబాబు సర్కారు చెప్పకనే చెబుతున్నట్టుగా ఉంది కదా!