హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థికమంత్రిగా వ్యవహరిస్తున్న యనమల రామకృష్ణుడిని తెలుగుదేశం పార్టీ పార్లమెంట్‌కు పంపబోతోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికైన జైరామ్ రమేష్, జేడీ శీలం, తెలుగుదేశం తరపున ఎన్నికైన కేంద్ర మంత్రి సుజనా చౌదరి, బీజేపీ తరపున ఎన్నికైన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభ సభ్యత్వ పదవీకాలం ఈ ఏడాది జూన్ నెలతో ముగియబోతోంది. సుజనా చౌదరి, నిర్మలా సీతారామన్‌లను మళ్ళీ నామినేట్ చేయాలని తెలుగుదేశం పార్టీ ఇప్పటికే నిర్ణయించింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క స్థానంకూడా లభించకపోవటంతో జూన్ నెలలో ఖాళీ అయ్యే నాలుగింటిలో మిగిలిన రెండింటినీ టీడీపీ, వైసీపీ చెరొకటి పంచుకోనున్నాయి. ఈ ఒక్క స్థానాన్ని బీసీలకు ఇవ్వాలని చంద్రబాబు ఎప్పుడో నిర్ణయించేశారు. ఆ స్థానాన్ని యనమలకు ఇవ్వనున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. యనమలకు ఎప్పటినుంచో రాజ్యసభలో ప్రవేశించాలన్నది బలమైన కోర్కెగా ఉందట. ఈ విషయాన్ని ఆయన పలు ఇంటర్వ్యూలలో కూడా చెప్పారు. అన్ని పదవులూ అనుభవించానని, ఒక్క రాజ్యసభ సభ్యత్వమొక్కటే తీరని కోర్కెగా మిగిలిందని యనమల ఎన్నోసార్లు అన్నారు. అయితే యనమల కేంద్రానికి వెళ్ళిపోతే రాష్ట్రంలో సంక్షోభ సమయాలలో అండగా ఉండే పెద్ద తలకాయను కోల్పోయినట్లవుతుందేమోనని కూడా చంద్రబాబు ఆలోచిస్తున్నారని అంటున్నారు. తూర్పు గోదావరి జిల్లా తుని ప్రాంతానికి ఆరు పర్యాయాలనుంచి యనమల ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వాలలో స్పీకర్‌గా, ఆర్థికమంత్రిగా కీలక పాత్ర పోషించారు.