కేసీఆర్కు అత్యంత సన్నిహితులైన వారు కూడా బీజేపీకి కోట్లలో విరాళాలిస్తున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ నుంచి బీజేపీకి ఎలక్టోరల్ ఫండ్ ద్వారా విరాళాలు ఇచ్చిన వారి వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో యశోదా ఆస్పత్రి ఏకంగా రూ.పది కోట్ల విరాళాన్ని బీజేపీకి ఇచ్చింది. యశోదా ఆస్పత్రి ఎవరిదో తెలంగాణ రాజకీయవర్గాలందరికీ తెలుసు. సీఎం కేసీఆర్కు ఎలాంటి సమస్య వచ్చినా యశోదకే వెళ్తారు. టీఆర్ఎస్ నేతలకు ఆ ఆస్పత్రి.. తమ పార్టీ ఆస్పత్రి అన్నంత అనుబంధం ఉంటుంది. అలాంటి ఆస్పత్రి యాజమాన్యం.. బీజేపీకి ఏకంగా రూ. పది కోట్ల విరాళాన్ని ఇచ్చింది.
ఆ స్థాయిలో విరాళం ఇచ్చిన మరో కార్పొరేట్ సంస్థ లేదు. బీజేపీ నేత, విశాఖ ఇండస్ట్రీస్ చైర్మన్ అయిన జి. వివెక్ మాత్రం రూ. మూడు కోట్లను విరాళంగా ఇచ్చారు. మిగిలిన వాళ్లు లక్షల్లోనే సమర్పించుకున్నారు. యశోదా ఆస్పత్రి యాజమాన్యానికి బీజేపీపై ఇంత ప్రేమ ఎందుకు పుట్టిందనేది ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే ఇది ప్రేమ కాదని.. బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో యశోదా ఆస్పత్రులపై ఐటీ దాడులు జరిగాయి. ఆ తర్వాత కొన్నాళ్లకే ఈ విరాళం ఇచ్చిందని.. మధ్యలో ఏం జరిగిందో అర్థం చేసుకోవచ్చని చెబుతున్నాయి.
రాజకీయ పార్టీలు ఈసీకి ఇచ్ిచన వివరాలు ఆధారంగా ఏడీఆర్ సంస్థ ఈ డీటైల్స్ విడుదల చేసింది ఎలక్టోరల్ బాండ్స్ .. ఎలక్టోరల్ ట్రస్టుల ద్వారా రాజకీయ పార్టీలకు విరాళిచ్చే సౌకర్యం ఉంది. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా విరాళాలిస్తే.. పూర్తి గోప్యం. ట్రస్టుల ద్వారా ఇస్తే.. పన్ను మినహాయింపు లభిస్తుంది. ఆ వివరాలు వెలుగులోకి వస్తాయి. మొత్తానికి దేశంలో అన్ని రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాల్లో 75 శాతం బీజేపీకే వెళ్తాయి. మిగతా పాతిక శాతం అన్ని పార్టీలు పంచుకుంటాయి. ప్రాంతీయ పార్టీల కన్నా అతి తక్కువగా కాంగ్రెస్ పార్టీకి విరాళాలు వస్తున్నాయి.