ఆంధ్రప్రదేశ్లో బూతుల పంచాంగం వినిపిస్తూ ప్రజలతో హవ్వ అనిపించుకుంటున్న పార్టీలు ఢిల్లీలోనూ పరువు తీసుకుంటున్నాయి. ఒకరికొకరు పోటీలు పడి మరీ ఫిర్యాదులు చేసుకుంటున్నారు. బూతుల పార్టీ మీదంటే మీదని రాష్ట్రపతి నుంచి ఎన్నికల సంఘం వరకూ ఫిర్యాదులు చేసుకుంటున్నారు. చంద్రబాబు బృందం రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిందని వైసీపీ టీమ్ కూడా అపాయింట్ మెంట్ తీసుకుని రాష్ట్రపతిని కలిసి.. టీడీపీ నేతలు ముఖ్యమంత్రిని బూతులు తిట్టారని.. ఫిర్యాదు చేశారు. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారిని తిట్టకుండా చట్టం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ప్రతిపక్ష నేతను అమ్మనాబూతులు తిట్టారు ఆయనది రాజ్యాంగబద్ధ పదవి కాదా అని టీడీపీ నేతలు ప్రశ్నించారు. సంస్కారం గురించి భాష గురించి వైసీపీ నేతలు మాట్లాడటం ఏమిటని కౌంటర్ ఇచ్చారు. రెండు రోజుల కిందట టీడీపీ నేతలు వెళ్లి వైసీపీ గుర్తింపు రద్దు చేయాలని కోరారు. ఎందుకంటే టీడీపీ మీద వైసీపీ నేతలు … టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని ఫిర్యాదు ఇచ్చారు. రాజకీయాల్లో ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఇలాంటి ఫిర్యాదులు చేయడానికి ఎవరైనా ఈసీ దగ్గరకు వెళ్తారా..? తెలుగు రాష్ట్రాల పార్టీలే వెళ్తున్నాయి.
ఏపీలో తిట్టుకున్నది కాకుండా.. తాము ఎలా తిట్టుకుంటామో ఢిల్లీలో కూడా ప్రచారం చేసుకుంటున్నాయి.. రెండు పార్టీలు కలిసి ఏపీ రాజకీయాలు ఎంత మలినం అయిపోయాయో.. ఢిల్లీలోనూ ప్రచారానికి పెడుతున్నారు. వీరి ఫిర్యాదుల దెబ్బకు అపాయింట్మెంట్లు ఇవ్వడానికి కేంద్ర మంత్రులు కూడా జంకే పరిస్థితి ఉంది. ఫిర్యాదులు చేయడానికి తమ సమయం ఎందుకు వృధా చేస్తారని ఎక్కవ మంది కేంద్ర మంత్రులు మొహం చాటేస్తున్నారు.