స్వయంగా జగన్ రెడ్డి గతంలో కన్నా ఎక్కువ సీట్లు గెలుస్తామని ప్రకటించినా వైసీపీలో ఆ ధీమా ఏమాత్రం కనిపించడం లేదు. ఇప్పటికే బెట్టింగ్ రాయుళ్లు కూటమిదే అధికారమని లక్షల్లో బెట్టింగ్ కాస్తుండగా…వైసీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు సైతం కూటమి విజయంపై పందెం కాస్తుండటం విశేషం.
పోలింగ్ ముగిసిన తర్వాత సీన్ అర్థమైందో మరేమిటో, వైసీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థుల్లో రోజులు గడిచే కొద్ది మార్పు కనిపిస్తోంది. ఈసారి వైసీపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదు అని ఓ అభిప్రాయానికి వస్తున్నారు. అంతేకాదు..తమ గెలుపుపై కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ అభ్యర్థులు. దీంతో ఎన్నికల్లో పెట్టిన ఖర్చును తిరిగి పొందేందుకు బెట్టింగ్ లో పాల్గొంటున్నారు.
బుకీల ద్వారా కోట్లలో పందేలు కాస్తున్నారు.వైసీపీ అధికారంలోకి రాదని, అలాగే తాము ఓడిపోతున్నామంటూ కొంతమంది అభ్యర్థులు బెట్టింగ్ కాస్తున్నారు. కూటమి గెలుస్తుందని ఓ వైసీపీ అభ్యర్థి ఏకంగా 50కోట్లు పందెం కాసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అలాగైనా ఎన్నికల్లో ఖర్చు చేసిన మొత్తాన్ని తిరిగి సంపాదించుకునే ఉద్దేశంతో ఈ బెట్టింగ్ మార్గం ఎంచుకున్నారని తెలుస్తోంది.