ఏపీలో మంత్రులు చేపట్టిన సామాజిక న్యాయభేరీ తర్వాత … ఆ రాష్ట్రంలో బడుగు, బలహీనవర్గాలకు ఇచ్చిన పదవులపై విస్తృత చర్చ జరుగుతోంది. మెల్లగా ఎవరెవరికి ఎన్ని పదవులు ఇచ్చారో లెక్కలు బయటకు వస్తున్నాయి. తాజాగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు పూర్తి జాబితాను ప్రకటించారు. తాను ప్రకటించిన దాంట్లో అవాస్తవముంటే చర్చకు రావాలని సవాల్ చేశారు. దాదాపుగా అదే జాబితాలోని ప్రకటిస్తారు.
రఘురామకృష్ణరాజు, టీడీపీ నేతలు ప్రకటిస్తున్న జాబితా ప్రకారం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో 981 నామినేటెడ్ పదవులు ఇస్తే ఇందులో రెడ్లకు 742 పోస్టులు రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారు. అలాగే యూనివర్శిటీల్ోల 12 మంది ఉపకులపతులను నియమిస్తే ఇందులో 10 మంది రెడ్లని నియమించారు. సలహాదారులు 42మంది ఉంటే ఇందులో 32 మంది రెడ్లు ఉన్నారు. రాష్ట్రం మొత్తాన్ని జగన్ నలుగురు రెడ్ల చేతిలో పెట్టారు. సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, విజయసాయిరెడ్డి మొత్తం ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. వీరి చేతిలో ఇతర పదవులు పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మంత్రులంతా కీలుబొమ్ములుగా మారారంటున్నారు.
అదే సమయంలో తమకు పదవులు ఇచ్చారు కానీ.. అసలు కార్యాలయాలు కూడా ఎక్కడున్నాయో తెలియడం లేదంటూ కార్పొరేషన్ చైర్మన్ల ఆక్రందనలు ప్రతీ రోజూ వెల్లడవుతూనే ఉన్నాయి. అనేక కార్పొరేషన్లకు కనీసం కార్యాలయాలు లేవు. వారికి అధికారాలు లేవు. విధులు లేవు. కానీ పేరుకే పదవులు ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అలాంటి పదవులు ఇచ్చి.. పూర్తిగా అధికారం అనుభవించే పదవులన్నీ రెడ్డి సామాజికవర్గానికే ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అలా ఇచ్చి కూడా సామాజిక న్యాయభేరీ అంటూ ప్రచారం చేసుకుంటూండటం… విచిత్రంగా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
రఘురామ సవాల్‌పై వైసీపీ నేతలు స్పందించే అవకాశం లేదు. కానీ వైసీపీ ప్రభుత్వంలో పదవులు పొందిన రెడ్ల సంఖ్య మాత్రం… ఇప్పటికే ప్రజల్లో జోరుగా చర్చనీయాంశమవుతోంది. ఇటీవల అర్హులైన బలహీనవర్గాల అధికారుల్ని కూడా కాదని.. రెడ్డి వర్గానికి చెందిన వారికి కీలక పోస్టింగ్‌లు ఇస్తున్న అంశం కూడా వివాదాస్పదమవుతోంది.