జనసేన పార్టీ అగ్రనేతలకు .. వైసీపీ కోస్తా, ఉత్తరతాంధ్ర వైసీపీ ముఖ్య నేతల నుంచి అంతర్గత అభినందనులు వెల్లువలా వస్తున్నాయి. పాత పరిచయాలు, బంధుత్వాలు, స్నేహాలను అడ్డం పెట్టుకుని కలుపుగోలుగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిణామాలు జనసేన ముఖ్య నేతల్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. పార్టీలోకి వస్తారా అని అడుగుతారేమో అని ఎక్కువ మంది ఈ హడావుడి చేస్తున్నారు. కొంతమంది నేరుగా తమ పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. తాము వస్తామని సంకేతాలు ఇస్తున్నారు. దీనికి కారణం కోస్తా, ఉత్తరాంధ్రలో వైసీపీకి భవిష్యత్ లేదని అనుకోవడమే.
లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అన్ని ప్రాంతాల్లోనూ ఓడిపోయింది. సాధారణ ఓటమి అయితే మరోసారి గెలుస్తామన్న ఆశ ఉండేది. కానీ ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో కూటమి నేతల మెజార్టీలు చూస్తే వైసీపీ నేతలకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. హయ్యస్ట్ మెజార్టీలు కూటమి అభ్యర్థులకు వచ్చాయి. ఇక గోదావరి జిల్లాల సంగతి చెప్పాల్సిన పని లేదు. విజయం ఖాయమనుకున్న తునిలో కూడా వైసీపీ పదిహేను వేల ఓట్ల తేడాతో ఓడిపోయింది. మినిమం యాభై వేలు అన్నట్లుగా ఏకపక్ష ఫలితాలు వచ్చాయి.
మొత్తంగా కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో వైసీపీకి 35 శాతం కంటే తక్కువగా ఓట్లు వచ్చాయి. ఇంత తేడా రావడంతో వైసీపీ నేతల్లో భవిష్యత్ భయం ప్రారంభమయింది. ఫలితాలు వచ్చిన రెండు రోజులకే ఉత్తరాంధ్ర, కోస్తాలోని కొంత మంది నేతలు జనసేన నాయకత్వంతో టచ్ లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. వైఎస్ఆర్సీపీ కోలుకుంటుందని ఎక్కువ మంది భావించడం లేదు. టిక్కెట్ల కొరత రాదని వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయని నమ్ముతున్నారు.