విజయనగరం జిల్లాలో లక్ష్మునాయుడు అనే ఉపసర్పంచి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన వైసీపీ నేత. పార్టీ అధికారంలోకి రావాలని బాగా ఖర్చు పెట్టుకున్నారు. పార్టీ అధికారంలోకి రాగానే మన ప్లేట్లో మన బిర్యానీ అని చెప్పి కొన్ని పనులు ఇచ్చారు. చేయండి.. సంపాదించుకోండి అని. పది లక్షల వరకూ ఖర్చుపెట్టి పనులు చేయించారు. కానీ బిల్లులు రావడం లేదు. పార్టీని అధికారంలోకి తేవడానికి ఖర్చు పెట్టుకుని..అధికారంలోకి వచ్చాక ఖర్చు పెట్టుకుని ఆయన ఆర్థిక పరిస్థితి కుంగిపోయింది. బిల్లుల కోసం ఎన్ని సార్లు తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం తెలియడంతో… వెంటనే ఆయన ఖాతాలో రూ. ఆరున్నర లక్షలు సొమ్ము జమ చేశారు అధికారులు.
ఆ వైసీపీ ఉపసర్పంచి లేఖ ఇప్పుడు విజయనగరం జిల్లాలో వైరల్ అవుతోంది. అది ఆయన రాసింది కాదని పోలీసులతో చెప్పించవచ్చు. లేకపోతే ఆ పెద్దాయనకు అక్రమ సంబంధాలు అంటగట్టవచ్చు.. కానీ నిజం ఏమిటో వైసీపీ క్యాడర్ కు బాగా తెలుసు. ఎందుకంటే కష్టనష్టాలు పడుతోంది వాళ్లే మరి. పార్టీ గెలిచేదాకా ఓ నష్టం.. గెలిచిన తర్వాత మరో నష్టం. పదవుల్లోకి ఎక్కిన నేతలు… దిగువ నేతల్ని కూడా దోచుకోవడం వదిలి పెట్టలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి.
గత రెండళ్ల నుంచి ఎంత మంది వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు ఆత్మహత్యలు చేసుకున్నారో లెక్కలేదు. దాదాపుగా సగానికిపైగా క్యాడర్ పార్టీ కోసం పని చేయడం మానేసింది. అయితే వారు లేకపోతేనేమి.. డబ్బులిచ్చి చేయించుకుంటున్న వాలంటీర్లు… ఇతరులు పని చేస్తారని హైకమాండ్ లైట్ తీసుకుంటోంది. ఇంత దారుణమా అని వైసీపీ క్యాడర్ వాపోతోంది. ఇక బిల్లులు రావాలంటే ఆత్మహత్య చేసుకోవాల్సిందేనని.. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.