పవన్ కల్యాణ్ ఎప్పట్లాగే రాజకీయ యాత్ర చేస్తున్నారు. కానీ ఈ సారి స్పెషల్ ఏమిటంటే… వైసీపీ నేతలు పట్టుబట్టి సక్సెస్ చేయడం. యాత్ర ప్రారంభమై పది రోజులు అయింది. వైసీపీలో కింది నుంచి పైదాకా వ్యవస్థలన్నీ కదిలిపోయాయి. వారాహిని పంది అనడం దగ్గర్నుంచి పవన్ కల్యాణ్ అంతు తేలుస్తామనేదాకా అన్నీ అనేశారు.. అంటున్నారు. సజ్జల నుంచి పోసాని వరకూ అందరూ రంగంలోకి వచ్చారు. వీరి కంగారు చూసి.. ఈ సారి పవన్ కొట్టే దెబ్బ ఎంత గట్టిగా ఉంటుందో అర్థమవుతోందని జనసైనికులు సెటైర్లు వేసుకుంటున్నారు. అయితే వైసీపీ ప్లాన్ కాపుల్లో చీలిక.. అది జరగబోదని అంటున్నారు.
ముద్రగడను ముందు పెట్టి కాపుల్లో చీలిక తెచ్చే ప్రయత్నం
పవన్ కల్యాణ్ యాత్ర ఎక్కడ పెట్టినా ఎవరూ జన సమీకరణ చేయాల్సిన పని లేదు. అదీ గోదావరి జిల్లాల్లో అయితే ఇక చెప్పాల్సిన పనిలేదు. ఈ సారి జన స్పందన కూడా అదే స్థాయిలో ఉంది. పవన్
పవన్ వారాహి యాత్ర ప్రభావం గోదావరి జిల్లాల్లో ఎక్కువగా ఉంటుందని అది కాపు ఓటు బ్యాంకును కన్సాలిడేట్ చేస్తుందన్న రిపోర్టులు రావడంతో వైసీపీ వెంటనే ముద్రగడను రంగంలోకి దింపింది. ఓ రెడ్డికి మద్దతుగా కాపు నేత పేరుతో పవన్ ను తిట్టడం అంటే.. మామూలు వ్యూహం కాదు. ఇలా చేయ.డానికి ఏ కాపు నేతా ముందుకు రాకూడదు. కానీ ముద్రగడ ఆ టైప్ కాదు. అందుకే వచ్చారు.
ముద్రగడ పోటీ సవాళ్లు అందుకే !
ముద్రగడ ఇంకా అధికారికంగా వైసీపీలో చేరలేదు. పైగా ఆయనకు కాపు రిజర్వేషన్ల కోసం పోరాడిన ముద్ర ఉంది. ఆయన ద్వారా పవన్ పై ఎటాక్ చేయిస్తే.. కాపుల్లో చీలిక వస్తుందన్న వ్యూహంతోనే ముద్రగడను రంగంలోకి దించారని అంటున్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా వైసీపీలోని కాపు నేతలు తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. ఆయనకు సొంత వర్గంలో ఎంత మద్దతు తగ్గించగలిగితే అంత వైసీపీకి ప్లస్ అనే భావన రావడంతో చివరికి పోసాని కృష్ణమురళి లాంటి వారిని కూడా రంగంలోకి దించి.. ముద్రగడకు మద్దతుగా మాట్లాడిస్తున్నారు. పవన్ కల్యాణ్ ను తమపై పోటీ చేయాలని విసురుతున్న సవాళ్లు కూడా అందులో భాగమే. ముద్రగడ ఇటీవలి కాలంలో ఎప్పుడూ గెలవలేదు. ఇండిపెండెంట్ గా కూడా పది వేల ఓట్లు రావు. అయినా సవాళ్లు చేస్తున్నారు.
కాపులు మొత్తం పవన్ వెనుక నడిస్తే వైసీపీ ఫినిష్ !
కాపు ఓటు బ్యాంక్ మొత్తం పవన్ వైపు కన్సాలిడేట్ అయితే.. వైసీపీకి ఇబ్బంది అవుతుందనే అంచనాలు ఉన్నాయి. అందుకే.. ఇప్పుడు కాపు ఓట్లను చీల్చే లక్ష్యంతో రాజకీయాలు చేస్తున్నారు. ప్రజారాజ్యం సమయంలో కానీ.. జనసేన గత ఎన్నికల్లో అదృష్టం పరీక్షించుకున్న సమయంలో కానీ.. కాపుల మద్దతు పూర్తి స్థాయిలో రాలేదన్న అభిప్రాయం ఉంది. టీడీపీకి కమ్మ సామాజికవర్గం.. వైసీపీకి రెడ్డి సామాజికవర్గం అండ ఉంటందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సారి పవన్ కు.. కాపు వర్గం అండగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇందు కోసం పవన్ గట్టి నమ్మకం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే ఈసారి పవన్ వైపు కాపు వర్గం మొత్తం ఏకం అవుతుందని భావిస్తున్నారు. అలా జరగకుండా ఉండేందుకు కుట్రల మీద కుట్రలు చేస్తున్నారు.