ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..? అనే అంశాలపై ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
కొడాలి నాని, అంబటి రాంబాబు, ఆర్కే రోజా, అనిల్ కుమార్ యాదవ్ లు.. వైసీపీ ఫైర్ బ్రాండ్స్ గా గుర్తింపు పొందారు. ఈ ఎన్నికల్లో వీరి గెలుపోటములపై ఏపీ వ్యాప్తంగా విస్తృత స్థాయిలో చర్చ జరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబును వ్యక్తిగతంగా ఈ నలుగురు టార్గెట్ చేసి విమర్శలు చేసేవారు. జగన్ ను ఏమైనా అంటే అంతెత్తున లేచేవారు. కాని, ఈ ఎన్నికల్లో వీరు ఎదురీత ఎదుర్కొంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
కొడాలి నాని..2004నుంచి వరుసగా గుడివాడలో గెలుస్తూ వస్తోన్న ఆయనకు ఈసారి కొంత ఇబ్బందికర పరిణామాలు తప్పేలా లేవు. ప్రభుత్వ వ్యతిరేకతతోపాటు స్థానికంగా కొడాలి నానిపై వ్యతిరేకత పెరగడంతో ఈసారి భంగపాటు తప్పదనే ప్రచారం జరుగుతోంది.అయితే, హోరాహోరీ పోరులో స్వల్ప ఓట్ల ఆధిక్యంతో నాని గెలుపొందే అవకాశం ఉందని సమాచారం.
రోజా.. నగరి నుంచి ఈసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని కృతనిశ్చయంతో ఉన్నారు. కాని, గ్రౌండ్ లో ఆమెకు పరిస్థితి అనుకూలంగా లేదన్నది ఓపెన్ సీక్రెట్. రోజాకు టికెట్ ఇచ్చినా గెలవదని పార్టీ నేతలు మొదటే జగన్ దృష్టికి తీసుకెళ్ళినా ఆయన మాత్రం రోజాపైనే నమ్మకం ఉంచారు. అయినప్పటికీ నేతలను సమన్వయం చేసుకోవడంలో రోజా విఫలమయ్యారు. పోలింగ్ ముగిశాక తనను ఓడించేందుకు సొంత పార్టీ నేతలే కుట్రలు పన్నారని ఆరోపించడంతో రోజా తన ఓటమిని ముందే అంగీకరించారా అనే ప్రచారం జరిగింది.
అంబటి రాంబాబుది కూడా అదే పరిస్థితి. సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తోన్న ఆయన స్థానికంగా వ్యతిరేకత మూటగట్టుకున్నారు. ఈ ఎన్నికల్లో అంబటికి నిరాశ తప్పదనే విశ్లేషణల నేపథ్యంలోనే ఆయన టీడీపీకి అనుకూలంగా ఈసీ పని చేసిందని తాజాగా ఆరోపించడం కొత్త చర్చకు తెరలేపింది. సత్తెనపల్లి ట్రెండ్స్ అర్థమయ్యే ఓటమి భయంతోనే ఈ విధమైన ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ అంటోంది.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పరిస్థితి కూడా ఏమంత ఆశాజనకంగా లేదు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా కొనసాగిన ఆయన్ను నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిపారు . టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయులు చేతిలో అనిల్ కు ఓటమి తప్పదని అంచనా వేసే పోలిసులపై పోలింగ్ ముగిశాక ఆరోపణలు చేశారని ప్రచారం జరుగుతోంది.