ఏపీలో హోరాహోరీ పోరు జరిగిందని కొంత మంది స్వయం ప్రకటిత విశ్లేషకులు చెబుతున్నారు. నిజానికి వీరెవరూ ఏపీలో పబ్లిక్ పల్స్ ను పట్టించుకోవడం లేదు. కేవలం తమ పర్సులో పడే బరువుల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. నిజంగా పబ్లిక్ పల్స్ గురించి ఆలోచించాలనుకుంటే ముందుగా గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల నుంచి విశ్లేషించుకుంటూ వచ్చేవారు.
రాష్ట్రంలో ఏ ఒక్క సర్వే సంస్థ కూడా తీసుకోలేనంత అతి పెద్ద శాంపిల్ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు. అన్ని వర్గాల ప్రజలు ఓట్లు వేశారు. ఇందులో వాలంటీర్లు ఉన్నారు. సచివాలయ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే.. కావాల్సినన్ని దొంగ ఓట్లు నమోదు చేసుకున్నారు. అయినా వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. ఎంత ఘోరంగా అంటే… రెండు గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో సమీపంలో కూడా ఉండలేకపోయారు.
విశాఖ గ్రాడ్యూయేట్ స్థానంలో టీడీపీ అభ్యర్థి చిరంజీవిరావుకు 94,509 వచ్చే సరికే వైసీపీ సుధాకర్ కు 59,644 ఓట్లు మాత్రమే వచ్చాయి. అప్పటికి యాభై శాతానికిపైగా రావడంతో కౌంటింగ్ నిలిపివేసి విజేతను ప్రకటించారు. అంటే దాదాపుగా రెట్టింపు ఓట్లు వచ్చాయి. తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అంత కంటే ఎక్కువ మెజార్టీ సాధించారు. పశ్చిమ రాయలసీమలోనూ విజేతగా టీడీపీ నేతే నిలిచారు. ఇంత కన్నా గొప్ప సర్వే ఏముంటుంది ?
ఈ గ్రాడ్యూయేట్ ఎన్నికల్లో వైసీపీనే గెలుస్తుందని ఐ ప్యాక్ సహా అందరూ చెప్పారు. వారంతా.. డబ్బులు తీసుకుని వైసీపీకి ఏం కావాలో అది చెప్పారని.. జనాల మనసుల్లో ఏముందో చెప్పలేదని తేలిపోయింది. ఇప్పుడు కూడా అదే బాటలో ఉన్నారు.