కర్నూలులో హైకోర్టు పెట్టే ఉద్దేశం లేదని అమరావతిలోనే ఉంచుతామని సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం చెప్పిన వ్యవహారం రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. రాయలసీమలోనూ చర్చనీయాంశం అయింది. ప్రభుత్వం మొదటి నుంచి రాజకీయంగా చూసింది కానీ నిజంగా హైకోర్టు పెట్టాలనే ఉద్దేశంతో చేయలేదన్న అభిప్రాయం అన్ని వైపుల నుంచి వినిపిస్తోంది. దానికి తగ్గట్లుగానే వైసీపీ నేతలు మౌనం పాటిస్తున్నారు. సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వ లాయర్ వాదనలపై మాట్లాడటం లేదు. విమర్శలు వచ్చినా .. మౌనమే మంచిదంటున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈ అంశంపై స్పందించలేదు.
కర్నూలులోనే హైకోర్టు ఉంటుందని ప్రభుత్వం చెబితే.. . అది సుప్రీంకోర్టునే తప్పుదోవ పట్టించినట్లు అవుతుంది. న్యాయమూర్తికి అంత స్పష్టంగా చెప్పి.. బయట ఇలా మాట్లాడటం… సుప్రీంకోర్టును మోసం చేసినట్లే అవుతుంది. అందుకే ఎవరూ మాట్లాడటంలేదు. కర్నూలులో హైకోర్టు పెట్టే ఉద్దేశం ఉంటే ఈ పాటికి ప్రతిపాదనలు పంపేవారని అంటున్నారు. అయితే వైసీపీ నాయకులు మాత్రం విచిత్ర వాదననతో అంతర్గతంగా ప్రజల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సుప్రీంకోర్టుకు అలా చెప్పినంత మాత్రాన హైకోర్టు పెట్టరా అని వాదిస్తున్నారు.
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తేడాగా ఉండటంతో సజ్జల పదే పదే మీడియాముందుకు వచ్చి మేం అనుకున్నట్లే తీర్పు వచ్చిందని చెబుతున్నారు. పకడ్బందీ చట్టం తెస్తామని అంటున్నారు. కానీ ఎలా తెస్తారో చెప్పడం లేదు. ప్రజల్ని మభ్య పెట్టేందుకు వారు ఏ మాత్రం వెనుకాడటం లేదు. రాయలసీమ ప్రజల్ని ఘోరంగా మోసం చేస్తూ.. రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తేలిపోయింది. పరిశ్రమలు తెచ్చి ప్రజలకు ఉపాధి కల్పించకుండా ప్రాంతీయ రాజకీయాలు చేసుకుంటే చివరికి దానికే బలయ్యే పరిస్థితి వైసీపీకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.