వైసీపీ నేతలు సామాజిక న్యాయబస్సు యాత్ర అని ఒకటి ప్రారంభిస్తున్నారు. వీరి ఉద్దేశం ఏమిటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జగన్ రెడ్డి ఎంతో చేశాడని చెప్పడం. ఏం చేశారో మాత్రం చెప్పరు. ఎందుకంటే ఏమీ చేయలేదు. అందరికీ ఇచ్చే పథకాలు మాత్రమే ఇస్తున్నరాని చెప్పుకుంటారు. అధికారం లేని పదవులు ఇచ్చామని చెప్పుకోలేరు. అసలు ఈ వర్గాలపై వైసీపీ ఆధిపత్య వర్గం ఎలా దాడి చేస్తుందో తాజా ఉదాహరణ బస్సు యాత్రకు ముందే బయటపడింది.
కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఓ ఎస్టీ మహిళపై వైసీపీ నేత దాడి చేశారు. ఎస్టీ మహిళను, ఆమెను కుమార్తెను ఇష్టం వచ్చినట్లుగా కొట్టారు. ఆమెపై దొంగతనం అభియోగం మోపారు. తర్వాత వారిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాడు.అక్కడ ఓ మహిళా ఎస్సై కూడా ఎస్టీ మహిళను కొట్టారు. ఎంత ఘోరంగా కొట్టారంటే ఆ మహిళా ఒంటిపై వాతలు తేలాయి. చివరికి ఈ విషయం బయటకు వచ్చింది. అంతే గగ్గోలు రేగింది. సోషల్ మీడియాలో సంచలనం అయింది. ఎస్టీ మహిళపై దాడి చేయడమేమిటని సమాజం ఆశ్చర్యపోయింది.
తప్పనిసరిగా పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ సదరు వైసీపీ నాయుకుడికి రాజారెడ్డి రాజ్యాంగం వర్తిస్తుంది కాబట్టి… బెయిలబుల్ సెక్షన్లు పెట్టి… స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేశారు. స్టేషన్ లోనూ మహిళను కొట్టిన మహిళా ఎస్ఐను వెకెన్సి రిజర్వ్ కు పంపారు. అంటే… కంటి తుడుపు చర్యలు. ఆ ఎస్టీ మహిళ ఆక్రందనల్ని కూడా… పోలీసులు వినిపించుకోలేదు. వైసీపీ నేతలకే ప్రివిలేజెస్ కల్పించారు.
బస్సు యాత్ర చేసే ముంద వైసీపీ నేతలు.. తమ మార్క్ సామాజిక న్యాయాన్ని ప్రజలకు చూపించి వెళ్తున్నారని ఇలాంటి ఘటనలు నిరూపిస్తున్నాయి. బడుగు, బలహీనవర్గాలు పైకి రాకుండా.. ఆర్థికంగా కుంగదీసి.. వారిని ఓటు బ్యాంకులుగానే ఉంచుకోవాలని.. తాము ఇచ్చే పథకాల డబ్బుల కోసం ఎదురు చూస్తూ గడపాలన్నట్లుగా కుట్రలు చేసిన ప్రభుత్వం… ఇప్పుడు వారిని ఉద్దరిస్తామని చెప్పుకునేందుకు బయలుదేరింది. కానీ ఆ వర్గాలపై చేస్తున్న అరాచకం నిరంతరం బయట పడుతూనే ఉంది.