వైఎస్ఆర్సీపీ ప్రాథమిక సభ్యత్వానికి బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ సీతంరాజు సుధాకర్ రాజీనామా చేశారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. విశాఖ సౌత్ టికెట్ ను సీతంరాజు సుధాకర్ ఆశించారు. జగన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత విశాఖలో ఆయన వెంట నడిచి పార్టీ కోసం ఖర్చు పెట్టుకున్న నేతల్లో ఒకరు సీతంరాజు సుధాకర్.
సౌత్ ఇంఛార్జి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ను ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే సీఎం జగన్ వచ్చే ఎన్నికల్లో వాసుపల్లికే టిక్కెట్ ఖరారు చేశారు. విశాఖ సౌత్ నియోజకవర్గం నుంచి గతంలో ద్రోణం రాజు సత్యనారాయణz ద్రోణంరాజు శ్రీనివాస్ లాంటి బ్రాహ్మణ నేతలు ఎమ్మెల్యేలుగా గెలిచారు. అక్కడి నుంచి పోటీ చేయాలని సుధాకర్ కోరుకున్నారు.
టీడీపీ నుంచి ఫిరాయించి వచ్చిన గణేష్ పై అసంతృప్తితో ఉన్న కార్పొరేటర్ ల మద్దతుతో టిక్కెట్ కోసం ప్రయత్నించారు. సుధాకర్ నియోజకవర్గంలో కీలక సమావేశాలు నిర్వహిస్తూ చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు. అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేకే జగన్ ప్రాధాన్యమివ్వడంతో సీతంరాజు సుధాకర్ మనస్తాపానికి గురయ్యారు. తన వర్గం కార్పొరేటర్లతో టీడీపీలో చేరేందుకు ఆయన సిద్దమైనట్లుగా తెలుస్తోంది.