ఏపీలో వైసీపీ పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని ఆ పార్టీ నేతలకూ తెలుసు. కానీ జగన్ రెడ్డికి నిజాలు చెప్పడం లేదో.. లేకపోతే ఆయనో మాయా ప్రపంచంలో ఉన్నారో కానీ… పార్టీ పరిస్థితి ఘోరంగా ఉందని ప్రజలకు చెప్పేలా కార్యక్రమాలు డిజైన్లు చేస్తున్నారు. ప్రోగ్రామ్స్ కు జనాలు రారని.. సమీకరించినా కష్టమేనని తెలిసినా బహిరంగసభలు ప్లాన్ చేస్తున్నారు. ఐ ప్యాక్ ఇస్తున్న సలహాలో… సలహదారులు ఇస్తున్న సలహాలో కానీ… బస్సు యాత్రను ప్లాన్ చేశారు.
నిజానికి ఇదే బస్సు యాత్ర గతంలో టీడీపీ మహానాడు పెట్టుకున్నప్పుడు చేశారు. ఘోరమైన ఫ్లాప్ అయింది. అయినా ఇప్పుడు మళ్లీ ప్లాన్ చేశారు. జగన్ రెడ్డి సభలకే.. డ్వాక్రా మహిళల్ని వాలంటీర్లను తరలించాల్సి వస్తోంది. ఇక పలుకుబడి లేని.. అధికారం లేని.. ఇవ్వని మంత్రుల సభలకు ఎలా వస్తారు ? . బస్సు యాత్రలో అవే కనిపిస్తున్నాయి. ఆర్టీసీ బస్సులు తిప్పినట్లుగా బస్సులో ఉన్న నేతలతో అటూ ఇటూతిరుగుతున్నారు. సాయంత్రానికి రోడ్లపై రెండు వందల కుర్చీలేసినా పట్టుమని వంద మంది ఉండటం లేదు. పార్టీకి చెందిన పదవులు పొందిన వారు వచ్చినా ఆ రెండు వందలు నిండాలి. .. కానీ వైసీపీ వాళ్లే సభలకు రావడంలేదు.
సొంత పార్టీ కార్యకర్తల్లోనూ నిరాసక్తత ఉందని పార్టీ నేతలకు తెలుసు. ఇలాంటి బహిరంగ కార్యక్రమాలు పెట్టుకుంటే ఫెయిలవుతాయని కూడా తెలుసు. అయినా పార్టీ పెద్దలు ఎందుకు ఇలాంటి యాత్రలు ప్లాన్ చేస్తున్నారో ఆ పార్టీ నేతలకు అర్థం కావడం లేదు. సామాజిక బస్సు యాత్ర పేరుతో చంద్రబాబు కుటుంబాన్ని తిట్టడం.. చంపుతాం.. లేపేస్తాం అని హెచ్చరించడం తప్ప… ఆయా వర్గాలకు ఏం చేశారో చెప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే అందరికీ ఇచ్చే పథకాలు తప్ప… ఏ ఒక్క వర్గానికి జగన్ రెడ్డి మేలు చేయలేదు.
బస్సు యాత్రల ద్వారా వైసీపీకి పరిస్థితి చాలా ఘోరంగా ఉందన్న విషయాన్ని ఆ పార్టీ నేతలే ప్రజల ముందు పెడుతున్నారు. ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దని… ముందుగానే ప్రిపేర్ చేస్తున్నట్లుగా ఈ వ్యవహారం ఉంది.