ఏపీలో అల్లర్లపై సిట్ దూకుడు కొనసాగుతుండటంతో పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు , అభ్యర్థులకు అరెస్ట్ భయం పట్టుకుంది. ఎప్పుడు అరెస్ట్ చేస్తారోనని ఆందోళన చెందుతున్నారు. ఇన్నాళ్ళు అధికారంలో ఉండటంతో తమకు వంతపాడిన అధికారులను పక్కనపెట్టి కొత్తవారిని నియమించడంతో వైసీపీ నేతలకు ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయం వేధిస్తోంది.
ఇప్పటికే పలువురు వైసీపీ నేతలపై హత్యాయత్నం కేసులు నమోదు అయ్యాయి. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి, మంచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టులపై హత్యాయత్నం కేసులు నమోదు కావడంతో నేతలు టెన్షన్ పడుతున్నారు. కేసులు, అరెస్టుల నుంచి తప్పించుకునే మార్గాలపై ఫోకస్ పెట్టారు. కేతిరెడ్డిపై మూడు కేసులు నమోదు కాగా రెండింట్లో కోర్టు నుంచి ఆయన స్టే తెచ్చుకున్నారు. మరో కేసు ఉండటంతో అది అరెస్ట్ కు దారితీస్తుందా..? అని ఆందోళన చెందుతున్నారు.
మచిలీపట్నంలో ఓటర్ ఇంటిపై దాడి ఘటనలో పేర్ని కిట్టూపై కేసు నమోదు కాగా, తాడిపత్రి అల్లర్లకు సంబంధించి పెద్దారెడ్డిపై కేసు నమోదు అయినప్పటికీ పూర్తి వివరాలు సేకరించిన అనంతరం ఆయనపై సిట్ అదనపు సెక్షన్లను జోడించే అవకాశం ఉంది. దీంతోపాటు మరికొంతమంది నేతలపై కూడా ఫిర్యాదులు రావడంతో వారిపై కూడా కేసులు నమోదు కానుండటంతో ఈ కేసులు, అరెస్టుల నుంచి బయటపడేందుకు వైసీపీ నేతలు లాయర్ల చుట్టూ తిరుగుతున్నారు.