బాలీవుడ్ నటి కేసు వ్యవహారం ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఓ పారిశ్రామికవేత్త కోసం నాటి ప్రభుత్వ నేతలు , అధికారులు కూడబల్కొని కాదంబరీ జెత్వానిని వేధించిన వైనం ఏపీ ప్రజలను నివ్వెరపరుస్తోంది. మనుషులు అనే వాళ్లు ఎవరైనా ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? అని వైసీపీ పెద్దలు, అధికారుల తీరును అసహించుకుంటున్నారు.
ఈ విషయంలో ఐపీఎస్ లు కూడా ఉండటంతో ప్రభుత్వం ఉన్నత స్థాయికి విచారణకు ఆదేశించింది. ఇందులో ఎంతటి వారున్నా వదలబోమని, జెత్వానికి న్యాయం చేస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటి కాదంబరీ జెత్వాని తనను వేధించిన వైసీపీ నేతలు, అధికారులపై ఫిర్యాదు చేసేందుకు ఏపీకి వచ్చింది.
తనను అప్పటి ప్రభుత్వ పెద్దలు, అధికారులు వేధించారని నాడు తనకు ఎదురైనా చేదు అనుభవాలను వివరిస్తూ కన్నీటి పర్యంతమైంది. ప్రస్తుత ప్రభుత్వం తనను, తన కుటుంబాన్ని వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. అయితే, కాదంబరీ జెత్వాని విషయం మూడు రోజులుగా తీవ్ర చర్చనీయంశం అవుతున్నా.. వైసీపీ దుర్మార్గమైన రాజకీయాలపై విమర్శలు వస్తున్నా..ఆ పార్టీ నుంచి ఎవరూ స్పందించడం లేదు.
నాటి ప్రభుత్వ పెద్దల మెప్పు పొందేందుకు అధికారులు అత్యుత్సాహంతో వ్యవహరించి ఇప్పుడు జైలుకు వెళ్లే పరిస్థితిని తెచ్చుకున్నారు. జెత్వానిని టార్చర్ చేసి , సైలెంట్ గా ముంబై పంపారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ లు..నాడు వైసీపీ నేతల ఆదేశాల మేరకే ఇదంతా చేశామని అటు వైపు చూస్తున్నా..వారు సైతం ఇరుక్కుపోయామని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు.