వైసీపీ నేతలు తాము సామాజికవర్గాలకు మేలు చేశామని.. ఒట్టు నమ్మాలని చెబుతూ బస్సు యాత్రలు ప్రారంభించారు. మూడు ప్రాంతాల నుంచి బస్సు యాత్రలు ప్రారంభించారు. వాటికి ఆదరణ సంగతి ఎలా ఉందో వైసీపీ నేతలకు బాగా అర్థమయింది కానీ.. అసలు ఈ బస్సు యాత్రల కాన్సెప్ట్ మాత్రం చంద్రబాబు కుటుంబాన్ని తిట్టడమే. అనంతపురం జిల్లా శింగనమలలో ప్రారంభమైన రాయలసీమ బస్సు యాత్రలో వైసీపీ నేతల ప్రసంగం అంతా చంద్రబాబు కుటుంబాన్ని, పవన్ కల్యాణ్ ను తిట్టడానికే సమయం కేటాయించారు.
ఉత్తరాంధ్రలో.. కోస్తాలో జరిగిన బస్సు యాత్రల్లోనూ అదే పరిస్థితి. బస్సు యాత్రలో మంత్రులు పాల్గొంటున్నా.. తాము ప్రజలకు ఏం చేశామో.. ముఖ్యంగా వారు చెబుతున్న బడుగు, బలహీనవర్గాలకు ఏం చేశామో చెప్పాల్సి ఉంది. కానీ చెప్పడానికి ఏమీ లేదు. అందరికీ ఇచ్చే పథకాలే ఇచ్చారు. వెనుకబడిన కులాలు ఆర్థికంగా పైకి రావడానికి ఉపయోగపడే అన్ని పథకాలను రద్దు చేసి కేవలం.. ఒకటి , రెండు పథకాలకు సంబంధించి నగదు బదిలీ చేస్తున్నారు. దీంతో ఎక్కువ కుటుంబాలు ఉపాధికి దూరమయ్యాయి. దీన్ని చెప్పడం లేదు. తాము నగదు బదిలీ చేశామని చెప్పుకోలేకపోతున్నారు. అందుకే చంద్రబాబు, పవన్ ను తిట్టడానికి జగన్ రెడ్డిని పొగడటానికి సమయం కేటాయిస్తున్నారు. బస్సు యాత్రలపై వైసీపీ నేతలకు..క్యాడర్ కే ఆసక్తి లేకుండా పోయింది.
ఈ ఖర్చు అంతా ఎవరు పెట్టుకుంటారని మంత్రులు కూడా లైట్ తీసుకుటున్నారు. సీఎం సభలకు అతి కష్టం మీద డ్వాక్రా మహిళల్ని తరలిస్తున్నారు. బస్సుయాత్రకు.. కూడా వాలంటీర్ల ద్వారా జన సమీకరణ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పెద్దగా ఎవరూ రాకపోతూండటంతో సమస్యగా మారింది. తొలి రోజు పరిస్థితుల్ని చూసిన తర్వాత బస్సు యాత్రను కంటిన్యూ చేస్తే పరువు పోతుందన్న అభిప్రాయంతో ఉన్నారు. ఈ యాత్ర ఎక్కువ రోజులు సాగదని.. వైసీపీ నేతలే ఓ అభిప్రాయానికి వస్తున్నారు.