ఆంధ్రజ్యోతి ఒక ఆసక్తికరమైన కథనాన్ని వెలుగులోకి తెచ్చింది. వైకాపాలో ప్రస్తుతం ఫైర్ బ్రాండ్ గా పేరు పొందిన ఎమ్మెల్యే రోజా.. త్వరలోనే ఆ పార్టీ మారబోతున్నట్టు ఆ కథనం సారాంశం! నిజానికి, వైకాపాలో మహిళా నేతగా ఆమెకి మంచి గుర్తింపే ఉంది. అధికార పార్టీ టీడీపీపైనా, ముఖ్యమంత్రి చంద్రబాబుపైనా తీవ్రస్థాయి విమర్శలు చేయాలంటే రోజా మైకు ముందుకు రావాల్సిందే. అలాంటి రోజాకు వైకాపాలో గుర్తింపు తగ్గింది అంటూ ఆ మీడియాలో కథనం వచ్చింది. వైకాపాలో ఆమెకు ప్రాధాన్యత తగ్గడానికి కారణలేంటో కూడా ఆ కథనంలో విశ్లేషించారు. ఆమె భవిష్యత్తు వ్యూహాలపై కూడా ఊహాగానాలు ప్రచురించారు.
గతంలో రోజాకి ఇచ్చిన ప్రాధాన్యతను ఈ మధ్య జగన్ గణనీయంగా తగ్గించారట! ఆమె అతి వాగుడు వల్ల పార్టీకి చెడు జరుగుతోందనీ, అంతర్గతంగా వైకాపా నిర్వహించుకున్న సర్వేలో కూడా ఇదే తేలిందని చెప్తున్నారు! రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాలో వైకాపా నానాటికీ వెనకబడుతోందన్న నివేదిక జగన్ చేరిందనీ, పార్టీలో కూడా ఆమె వ్యవహార శైలి చేటు తెచ్చే విధంగా మారుతోందని సదరు సర్వే చెప్పిందట. దాంతో ఈ మధ్యనే రోజాకు జగన్ పెద్ద క్లాసే తీసుకున్నారట! రోజాపై జగన్ వైఖరి మారిందని చెప్పడానికి విశాఖలో జరిగిన మహాధర్నాకు ఆమె గైర్హాజరీయే రుజువు అంటూ ఆ కథనంలో పేర్కొన్నారు.
అంతేకాదు, ఈ పరిణామాల నేపథ్యంలో ఆమె వైకాపా నుంచి బయటకి వచ్చేందుకు కూడా ప్రయత్నిస్తున్నారట! ఆమె జనసేనలో చేరే అవకాశం ఉందనీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు ద్వారా మంతనాలు సాగుతున్నాయని సదరు కథనంలో పేర్కొన్నారు. జనసేన తరఫు నుంచీ రోజాకు రాయలసీమ ప్రాంతంలోనే ఎంపీ టిక్కెట్ ఇప్పించేలా నాగబాబు తెర వెనక ప్రయత్నాలు సాగిస్తున్నట్టు పేర్కొన్నారు!
అయితే, వైకాపాలో ఇతర నేతల పరిస్థితి వేరూ.. రోజా పోషించిన పాత్ర వేరు. కారణాలు ఏవైనా, సందర్భాలు ఎలాంటివైనా అధికార పార్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆమె కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పైగా, వైకాపా తరఫున బలంగా మాట్లాడే నాయకులు ఆమె! అలాంటి రోజాను వైకాపా దూరం చేసుకుంటుందా అనేదే ప్రశ్న..? ఒకవేళ ఆమె తీరు బాగులేకపోయినా, సర్వే ఫలితాలు ఇంకోలా ఉన్నా నచ్చజెప్పుకునే ప్రయత్నం చేస్తారు కదా! పైగా, ప్రస్తుతానికి ఒక దశా దిశాలేని జనసేనలో చేరేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు అనేది ఎందుకో ప్రస్తుతానికి డైజెస్ట్ కాని విషయం! ఒకవేళ రోజా బయటకి వెళ్తే వైకాపాకి పెద్ద కుదుపే అవుతుంది! దానిపై టీడీపీ ఒక రేంజిలో విమర్శలు గుప్పిస్తుందనీ, అది వైకాపాకి ఇబ్బందికరమైన పరిస్థితే అవుతుందని జగన్ అంచనా వేస్తారు కదా! మరి, ఈ కథనంపై రోజా స్పందన ఎలా ఉంటుందో చూడాలి. అయితే, రాజకీయాలు అన్నాక అనూహ్యమైన ట్విస్టులు ఎప్పుడైనా ఎక్కడైనా ఉండొచ్చు అనేది మనం మరచిపోకూడదు!