సుబ్బారావు గుప్తాపై దాడి ఘటన వైసీపీలో అంతర్గతంగానూ అలజడి రేపుతోంది. ఆర్యవైశ్య నేతలు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు సుబ్బారావు గుప్తాను ఓ మస్లిం నేత దారుణంగా కొట్టడమే కాదు.. ఆయన తల్లిని కుటుంబసభ్యులను కూడా దూషించడాన్ని తప్పు పడుతున్నారు. ఇంత అవమానం తట్టుకోలేకపోతున్నామన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నారు. త్వరలో సీఎం జగన్‌ను కలిసి సంచలన నిర్ణయం ప్రకటిస్తానని ఆయన చెప్పుకొచ్చారు. ఆ సంచలన నిర్ణయం ఏమిటనేది గిద్దలూరులో చర్చనీయాంశంగా మారింది.
సీఎం జగన్ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు ఇవ్వడం లేదు. అన్నా రాంబాబు కూడా చాలా కాలంగా సీఎంను కలవాలని అనుకుంటున్నారు. కానీ చాన్స్ దొరకడం లేదు. మరో వైపు గిద్దలూరులో వైసీపీ అంతర్గత రాజకీయాలు వేడెక్కారు. గిద్దలూరులో వైసీపీలోని రెడ్డి సామాజికవర్గం మొత్తం ఏకం అయింది. అది తమ సీటు అని ఈ సారి రాంబాబుకు టిక్కెట్ ఇస్తే పని చేయబోమని చెబుతున్నారు. పోటా పోటీ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇది ఆయనను ఇబ్బంది పెడుతోంది. ఇలాంటి వాటిని చెప్పుకుందామనుకున్నా ఆయనకు చాన్స్ రావడం లేదు.
అదే సమయంలో ఆయన ఆర్యవైశ్యకోటాలో మంత్రి పదవిని ఆశిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. మంత్రులందర్నీ మారిస్తే వెల్లంపల్లిని కూడా మార్చాలి. ఆర్యవైశ్య కోటాలో మరొకరికి చాన్స్ ఇస్తే అది తనకే ఇవ్వాలని కోరుకుంటున్నరు. అందుకే సంచలన నిర్ణయం అంటూ ఓ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా చూస్తే వైసీపీలో ఎంత కట్టడి చేసినా అసంతృప్తి వర్గాలు.. తమ డిమాండ్లతో ఏదో రూపంలో తెరపైకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయని అర్థమవుతోంది.