వైసీపీ ఎంపీలకు ఇంత వరకూ ఏ ఎంపీలు చేయని పనులు టాస్క్‌గా లభిస్తున్నాయి. రాష్ట్రం కోసం ఎక్కడా గొంతెత్తకూడదని ముందుగానే చెప్పి పంపిన పార్టీ పెద్దలు.. అదే సమయంలో ఏపీ గురించి ఎవరైనా మాట్లాడితే అడ్డుకునే టాస్క్ కూడా ఇచ్చారు. అందుకే వైసీపీ ఎంపీలు అసలు మాట్లాడటం మానేశారు. ఎవరైనా మాట్లాడటం మానేశారు. ఎవరైనా మాట్లాడుతూంటే మాత్రం దూకుడుగా అడ్డుకుంటున్నారు. వారి దురదృష్టం ఏమిటంటే.. వారు ఎక్కువగా అడ్డుకోవాల్సి వస్తోంది కూడా తమ పార్టీ తరపున గెలిచిన రఘురామకృష్ణరాజునే. అయితే ఆయన మాత్రం సైలెంట్‌గా ఉండటం లేదు. పార్లమెంట్లో వైసీపీ ఎంపీల పరువు తీస్తున్నారు.
గురువారం రోజు ఏపీ ఆర్థిక పరిస్థితిపై మాట్లాడిన రఘురామ రాజు జగన్ సర్కార్ కార్పోరేషన్ల పేరుతో రుణాలు తీసుకోవడంతో పాటు ఆ నిధుల్ని కూడా ఇతరత్రా అవసరాల కోసం మళ్లిస్తోందని సభ దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా ఏపీ బేవరెజేస్ కార్పోరేషన్ పేరుతో అప్పులు తీసుకోవడం, వాటిని మూలనిధికి జమ చేయకపోవడాన్ని రఘురామ తప్పుబట్టారు. కార్పొరేషన్ల పేరుతో రుణాలు తీసుకొని నిధులను మళ్లిస్తున్నారన్నారు. ఆయన ఇలా మాట్లాడుతూండటంతో ఎంపీలు మార్గాని భరత్ , వంగ గీత అడ్డుకునే ప్రయత్నం చేశారు. అది వాగ్వాదానికి దారి తీసింది. చివరికి రఘురామ .. భరత్‌ను సిట్ డౌన్ అని అరిచి కూర్చోబెట్ాల్సివచ్చింది.
వైఎస్ఆర్సీపీ ఎంపీలు పరస్పరం వాగ్వాదానికి దిగడంతో స్పీకర్ స్ధానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ వారిని వారించారు. సభాధ్యక్ష స్ధానాన్ని ఉద్దేశించి మాట్లాడాలని రఘురామకు సూచించారు. దీంతో ఆయన తన అరచేతిని అడ్డుపెట్టుకుని మరీ మాట్లాడారు. తాను స్పీకర్ ను ఉద్దేశించి మాత్రమే మాట్లాడుతున్నట్లు చెప్పారు. ఈ వాగ్వాదంలో రఘురామదే పైచేయి కావడంతో వైసీపీ ఎంపీలు చిన్న బుచ్చుకున్నారు.