రాధా – రంగా అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖలో రంగా వర్థంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించింది. పార్టీకి చెందిన నేతలు ఎవరూ హాజరు కావద్దని పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. కొన్ని నియోజకవర్గాల్లో వంగవీటి రంగా విషయంలో వైఎస్ఆర్సీపీ నేతలు వ్యూహాత్మకంగా నివాళి అర్పించారు కానీ.. ఆ పార్టీ హైకమాండ్ మాత్రం విశాఖ సభకు హాజరు కాకూడదన్న నిర్ణయంతో.. తమ వైఖరి స్పష్టం చేసినట్లయింది.
విశాఖపట్నం ఏఎస్ రాజా గ్రౌండ్స్ లో జరగనున్న ఈ సభను గంటా శ్రీనివాస్ ఏర్పాటు చేశారని చెబుతున్నారు. గంటా శ్రీనివాస్ ఇటీవల కాపు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఆయన పలువురు కాపు నేతలతో భేటీ అయ్యారు. తాము పెడుతున్న సభ వెనుక రాజకీయ ఎజెండా ఉందని గంటా కూడా చెబుతున్నారు. వేదికపై నుంచి ప్రకటిస్తామన్నారు. కాపునాడు నేతలు వైసీపీ కాపు నేతలందర్నీ కూడా పిలిచారు. వారి ఫోటోలను ఫ్లెక్సీల్లో వేశారు ., అయినా కూడా వైసీపీ నేతలు.. ఆ సమావేశానికి వెళ్లవద్దని హైకమాండ్ ఆదేశించింది.
స్టేజ్ పై వైసీపీ నేతలు ఉన్న సమయంలో జై జనసేన నినాదాలు చేస్తే ఇబ్బంది పడాల్సి ఉంటుందని ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. కాగా.. సమావేశం కోసం నిర్వాహకులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. అయితే తాజా పరిస్థితుల ప్రభావంతో ఈ మీటింగ్ పూర్తిగా టీడీపీ, జనసేన ఆధ్వర్యంలోనే జరుగనుంది. వంగవీటి రంగాను హత్య చేసినా తప్పు లేదని వ్యాఖ్యానించిన జగన్ రెడ్డి బంధువు గౌతంరెడ్డికి కార్పొరేషన్ పదవి ఇచ్చారు. దేవినేని అవినాష్ ను పార్టీలో చేర్చుకున్నారు. ఇవన్నీ కాపుల మీటింగ్ లో వైసీపీ నేతలకు ఇబ్బందికరం అవుతాయని.. ఎందుకైనా మంచిదని.. మీటింగ్ కు వెళ్లవద్దని చెప్పినట్లుగా తెలుస్తోంది.