ఏపీకి కేంద్రం పెద్దపీట వేసింది. బడ్జెట్ లో వరాల జల్లు కురిపించింది. రాజధాని అమరావతి నిర్మాణంకు 15వేల కోట్ల సాయం చేయనుంది.. పోలవరం నిర్మాణానికి కేంద్రం సహాయ సహకారాలు అందిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రాయలసీమ, ప్రకాశం, కోస్తా ఆంధ్రలలో వెనుకబడిన జిల్లాలకు ఆర్ధికసాయం అందిస్తామన్నారు.
బడ్జెట్ కేటాయింపులపై కూటమి నేతలు ఖుషీ,ఖుషీ అవుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో చంద్రబాబు చేసిన కృషి ఫలించిందని భావిస్తున్నారు. బడ్జెట్ సమావేశాలకు ముందుగా ఢిల్లీకి వెళ్లి ప్రధానితో సహా కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రాభివృద్దికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని చంద్రబాబు అభ్యర్థించారు. కేంద్రం కూడా అందుకు సానుకూలంగా స్పందించి పెద్ద మొత్తంలో నిధుల విడుదలకు హామీ ఇచ్చింది.
Also Read : దటీజ్ బాబు.. అమరావతికి బడ్జెట్లో నిధులు!
ఏపీకి కేంద్రం ప్రత్యేక నిధుల కేటాయింపును అందరూ స్వాగతిస్తున్నారు. కానీ , ఇంతవరకు బడ్జెట్ పై వైసీపీ స్పందించలేదు. దీంతో ఎందుకు నోరు విప్పడం లేదన్న చర్చ జరుగుతోంది. ఎన్డీయేకు వ్యతిరేకంగా పెదవి విరిస్తే కేంద్ర పెద్దల ఆగ్రహానికి గురి అవుతామని వైసీపీ సైలెంట్ గా ఉంటుందా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
వీటన్నింటిని పక్కనపెట్టి ఈ బడ్జెట్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తే.. ఐదేళ్లలో వైసీపీ ఏం సాధించింది అనే చర్చ జరుగుతోంది..ఇది తమను మరింత ఇరకాటంలోకి నెడుతుంది అనే ముందుచూపుతోనే మౌనం వహిస్తుందా? అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. గతంలో కేంద్రం ఇచ్చిన నిధులను కూడా సరిగా వాడుకోలేదు వైసీపీ. ఇప్పుడు ఈ బడ్జెట్ పై విమర్శ చేస్తే గతాన్ని తవ్వి తీసుకున్నట్లు అవుతుందనే ఆలోచనతోనే రియాక్ట్ కావడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.