రాజకీయాల్లో కనీస విలువలు పాటించని వైసీపీ అగ్రనాయకత్వం చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా ప్రజల్లోకి వెళ్తున్న ఆయన సతీమణి, ఎన్చీఆర్ కుమార్తె నారా భువనేశ్వరిపై అడ్డగోలు మాటలతో విరుచుకుపడే నేతలను రంగంలోకి దింపింది. సజ్జల పార్టీ ఆఫీసు నుంచి మెసెజ్ రావడం ఆలస్యం.. కట్లు తెంపుకున్నట్లుగా విరుచుకుపడే నేతలు.. రోజా, కొడాలి నాని, వెల్లంపల్లి వంటి వారు తమ నోటికి పని చెప్పారు. భువనేశ్వరి పై అనుచిత వ్యాఖ్యలతో విమర్శల దాడి ప్రారంభించారు.
తాను ఎవర్నైనా ఎలాంటి మాటలైనా అనొచ్చు తనను అంటే మాత్రం మీడియా ముందు శోకాండాలు పెట్టే రోజా భువనేశ్వరిపైనా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసేది ఫ్యాషన్ షో అని వ్యాఖ్యానించారు. రోజా వ్యాఖ్యలపై వైసీపీలోనూ విస్మయం వ్యక్తమవుతోంది. ఓ పద్దతి అంటూ ఉండదా.. రాజకీయాల్ని రాజకీయంలాగా చేయలేమా.. ఇంకెంత దిగజారిపోవాలన్న విరక్తి ఆ పార్టీలో మెజార్టీ నేతల్లో వచ్చింది. కొడాలి నాని కూడా తనదైన లాంగ్వేజ్ తో భువనేశ్వరిపై మాటల దాడి చేశారు. ఇక చాలా మంది మాట్లాడేది లేదన్నారేమో కానీ.. చివరికి వెల్లంపల్లిని రంగంలోకి దించారు.ఆయన కూడా ఇష్టం వచ్చినట్లుగా నోరు పారేసుకున్నారు. భువనేశ్వరి మొదటి సారిగా రాజకీయ పర్యటన చేస్తున్నారు. చంద్రబాబు అరెస్టు కారణంగా మానసిక ఒత్తిడి గురై చనిపోయిన కుటుంబాలకు అండగా ఉండేందుకు పర్యటనలు ప్రారంభించారు.
ఈ పర్యటనల సమయంలో… వివిధ వర్గాలతో సమావేశం అవుతున్నారు. అలాగే ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకూ ఉన్న భువనేశ్వరి వేరు..ఇక ముందు ఉండే భువనేశ్వరి వేరు. ఆమె నేరుగా రాజకీయ పర్యటనలు చేస్తున్నరు. చంద్రబాబును అక్రమంగా జైల్లో పెట్టారని ప్రజలకు చెప్పబోతున్నారు. ఈ క్రమంలో వైసీపీ ఆమెపై మరింతగా మానసిక దాడి చేసేందుకు రెడీ అయింది.
ఇప్పటికే చంద్రబాబు ఆహారంలో ఏదో పెడుతున్నారని.. చంద్రబాబు ఆరోగ్యం క్షీణించడానికి భువనేశ్వరినే కారణం అని.. డిప్యూటీ సీఎం నారాయణ వంటి వారితో చెప్పిస్తున్నారు. ఈ దాడి మరింతగా పెంచి ఆమెను మానసికంగా హింసించేందుకు వైసీపీ సిద్దమైనట్లుగా కనిపిస్తోంది.