బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ 90,089 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మొత్తం పదమూడు రౌండ్ల కౌంటింగ్‌లో ఆమెకు 1,11,710 ఓట్లు రాగా సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి పనతల సురేష్‌కు 21621 ఓట్లు పోలయ్యాయి. దీంతో 90,089 ఓట్ల తేడాతో డాక్టర్ సుధ విజయం సాధించినట్లయింది. కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మకు 6205 ఓట్లు పోలయ్యాయి. నోటాకు 3622 ఓట్లు పోలయ్యాయి.
బద్వేలు నియోజకవర్గంలో మొత్తం 2,15,240 ఓట్లు ఉండగా, 1,47,213 ఓట్లు పోలయ్యాయి. పోలయిన ఓట్లలో 76 శాతం వైసీపీ అభ్యర్థికే పోలయ్యాయి. బద్వేలులో వైసీపీ విజయంపై ఎవరికీ అనుమానాల్లేవు. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన కూడా బరిలో నిలబడలేదు. లక్ష ఓట్ల మెజార్టీని లక్ష్యంగా పెట్టుకోవాలని సీఎం జగన్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసి పంపించారు. దానికి తగ్గట్లుగానే ఎన్నికల బాధ్యతలు తీసుకున్న పెద్దిరెడ్డి శ్రమించారు. అయితే ఓటింగ్ శాతం గత ఎన్నికల కంటే ఎనిమిది శాతం వరకూ తగ్గడంతో లక్ష మెజార్టీని అందుకోలేకపోయారు.
బద్వేలులో గత ఎన్నికల్లో బీజేపీ నోటా కంటే తక్కువగా 735 ఓట్లు వచ్చాయి. ఈ సారి దాదాపుగా 21వేలకుపైగా ఓట్లు సాధించారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి నలభై వేల ఓట్ల మెజార్టీ వచ్చింది. ఈ సారి అది రెండింతలు అయింది. ఇది తమ ప్రభుత్వ పాలనకు ప్రజామోదానికి సాక్ష్యమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.