హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఎస్ఆర్ నగర్‌లోని అపార్ట్‌మెంట్‌పై నార్కోటిక్ బ్యూరో అధికారులు దాడులు చేశారు. ఈ తనిఖీల్లో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అపార్ట్మెంట్లో నెల్లూరు జిల్లాకు చెందిన యువకులు డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు చేశారు.
పట్టుబడిన వారిలో నెల్లూరు అర్బన్ డెలవప్మెంట్ బోర్డు చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ కుమారుడు ఉన్నాడు. ద్వారకనాథ్ పేరుపై ఉన్న కారును కూడా పోలీసులు స్వాధఈనం చేసుకున్నారు. కారు నెంబర్ ప్లేట్‌పై నుడా ఛైర్మన్ అనే స్టిక్కరింగ్ ను నార్కోటిక్ బ్యూర్ పోలీసులు గుర్తించారు. ప్రేమ్ చంద్ అనే వ్యక్తి తన బర్త్ డే పార్టీ కోసం గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చారని నార్కోటిక్ బ్యూరో అధికారులు తెలిపారు. దాదాపు 30 మంది వరకు సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఇంజినీరింగ్ విద్యార్థులు కలిసి డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్నారని తెలుస్తోంది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం కృషి చేయాలని అధికారులను ఆదేశించడంతో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు డ్రగ్స్, గంజాయి తదితర వాటిపై నిఘా పెంచారు. ఈ క్రమంలో వైసీపీ నేతల కుమారుల డ్రగ్స్ పార్టీ గురించి బయటపడింది. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని రేవంత్ రెడ్డి ఆదేశించిన తర్వాత పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టినా.. ముక్కాల వారసుడు ఇలా లైట్ తీసుకుని పార్టీని ఏర్పాటు చేసుకోవడం సంచలనంగా మారింది.