మేనిఫెస్టోలో మొత్తం 129 హామీలు ఇచ్చామని… ఇప్పటికే 77 అమలు చేసేశామని.. అమలు కోసం మరో 36 హామీలు సిద్ధంగా ఉన్నాయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అంటే 90 శాతంపూర్తి చేసినట్లన్నారు. మిగిలిన 16 హామీలను కూడా త్వరలోనే పరుగులు పెట్టిస్తామన్నారు. అలాగే మేనిఫెస్టోలో లేని మరో 40 హామీలను కూడా అమలు చేశామని ప్రకటించారు. పాలన పూర్తయి ఏడాది అయిన సందర్భంగా ముఖ్యమంత్రి రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా.. ప్రజలు మెచ్చే విధంగా ఏడాది పాలన సాగిందని సంతృప్తి వ్యక్తంచేశారు.
ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా రైతులతో గడపడం చాలా సంతోషంగా ఉందన్న సీఎం.. రైతుభరోసా కేంద్రాలతో గ్రామాల్లో విప్లవాత్మక మార్పులువస్తాయన్నారు. రైతు భరోసా ద్వారా రూ.10,200 కోట్లును 49 లక్షల మంది రైతులకు పంపిణీ చేశామని.. విత్తనం నుంచి అమ్మకం వరకూ.. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఏడాదిలో 3 కోట్ల 58 లక్షల మందికి రూ. 40,627 కోట్లను సంక్షేమ పథకాల రూపంలో అకౌంట్లలో వేసినట్లుగా జగన్ చెప్పారు. ఏడాది కాలంగా.. మీ కుటుంబ సభ్యుడిగా.. నేను చేసిన ప్రమాణానికి అనుగుణంగా మీ కోసం పనిచేస్తున్నానని ప్రకటించారు.
సంక్షేమ పథకాలను విపక్షాలు కోర్టుకెళ్లి అడ్డుకుంటున్నాయని..జగన్ విమర్శలు గుప్పించారు. .ప్రభుత్వ భూమిని పేదలకు ఇస్తుంటే.. కోర్టుకెళ్లి అడ్డుకునే ప్రతిపక్షాన్ని ఇప్పుడే చూస్తున్నాననియ… గత ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వాస్పత్రులు.. చివరకు ప్రభుత్వ డెయిరీలను మూసివేసేందుకు కుట్ర చేసిందని ఆరోపించారు. ప్రభుత్వ పథకాలను డోర్ డెలివరీ చేసి..అందరికీ సంక్షేమం అందిస్తున్నామన్నారు.