ఈ మధ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏ పథకం ప్రకటించినా… అది తమ నుంచి కాపీ కొట్టేసిందే అంటూ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డితో సహా వైకాపా నేతలు విమర్శిస్తుంటారు. పెన్షన్లు రెండింతలు పెంచినా, మహిళలకు పసుపు కుంకుమ ఇచ్చినా, రైతులకు సాయం ప్రకటించినా… ఇలా ఏది చేసినా అది తాము ఇవ్వాలనుకున్నదే అంటూ చేతులు తడుముకుంటూ ఉంటారు. ఇక, బీసీల విషయంలో అయితే చెప్పాల్సిన పనేలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీలకు వరాలు కురిపించిన దగ్గర్నుంచీ… అవి కూడా తాము రాసుకున్న వరాలే అంటూ వచ్చారు. సరే, ఇప్పుడు బీసీ గర్జన అంటూ ఏలూరులో జగన్ ఒక సభ నిర్వహించారు. ఈ సభ తీరు తెన్నులు చూస్తే…. టీడీపీ నిర్వహించిన బీసీ గర్జన సభను మక్కీమక్కీకి కాపీ కొట్టినట్టుగా ఉంది. వేదిక దగ్గర్నుంచీ, ప్రసంగం, పథకాలు ప్రకటన… అన్నీ టీడీపీ నుంచి కాపీ… పేస్ట్ అన్నట్టుగా ఉన్నాయి. అయినా, అధికారంలో ఉన్నవారు పథకాలు ప్రకటిస్తారుగానీ… ప్రతిపక్షంలో ఉండి కూడా పథకాల ప్రకటనలు చేస్తున్న నాయకుడు బహుశా జగన్ తప్ప మరొకరు ఉండరేమో.
చంద్రబాబు నాయుడి ఐదేళ్ల పాలన నుంచి మార్పు కోరుతూ ఈ సభ నిర్వహిస్తున్నామన్నారు జగన్. పాదయాత్ర మొదలు కాకముందే తాను బీసీ నాయకులు జంగా కృష్ణమూర్తి అధ్యక్షత ఒక కమిటీ వేయించాననీ, ఆ తరువాత పాదయాత్ర చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీలను స్వయంగా కలుసుకుని కష్టాలు తెలుసుకున్నానన్నారు జగన్. ప్రతీ బీసీ సోదరుడి ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే తన లక్ష్యమన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే… టీడీపీ ప్రభుత్వం వరాలు కురిపించక ముందు నుంచీ తమకు బీసీలంటే ప్రేమ ఉందని చెప్పే ప్రయత్నం ఇది. ఇక, హామీలు… కాదుకాదు జగన్ చాలా పథకాలు ప్రకటించారు. బీసీల సంక్షేమం కోసం రూ. 1500 కోట్లకు తక్కువ కాకుండా నిధి, బీసీ సబ్ ప్లాన్ కి చట్టబద్ధత, నాయీ బ్రాహ్మణులకు ఏడాదికి రూ. 10 వేలు, వెనకబడిన తరగతులకు 138 కార్పొరేషన్లు, మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో రూ. 10 వేలు… ఇలా చాలాచాలా ప్రకటించుకుంటూ పోయారు.
మొత్తానికి, ఈ బీసీ గర్జన ఎలా ఉందంటే… చంద్రబాబు నిర్వహించిన జయహో బీసీకి సమాధానంగా ఉంది. సీఎం ప్రసంగానికి కౌంటర్ గా జగన్ మాట్లాడారు. వాస్తవానికి, ప్రభుత్వం ప్రకటించినవి అమలు చేస్తోంది. నిర్ణయాలు జరిగిపోయాయి. ముఖ్యమంత్రి ప్రకటించినవి హామీలు కావు… నిర్ణయాలు. కానీ, జగన్ తాను ప్రకటిస్తున్న హామీలనే నిర్ణయాలు అనుకుంటున్నారు! అధికార పార్టీ వైపు బీసీలు మళ్లుతున్నారేమో… ఆ పార్టీ నిర్ణయాలకు ఆకర్షితులౌతున్నారేమో… వాటి కంటే ఎక్కువగా డబ్బులిచ్చేద్దాం, పథకాలు ఇచ్చేద్దాం అనే ఉద్దేశమే వైకాపా సభ వెనక కనిపిస్తోంది. అంతేగానీ… స్వతహాగా బీసీలకు ఏదో చేద్దామనే చిత్తశుద్ధి కనిపించడం లేదు. ఓరకంగా ఇది టీడీపీ ప్రేరిత వైకాపా బీసీ గర్జన అనొచ్చు.