“మీ వెనుక సీఎం ఉన్నాడ”ని అధికారులకు ముఖ్యమంత్రి జగన్ భరోసా ఇచ్చారు. అక్రమ ఇసుక, మద్యం స్మగ్లింగ్ వంటి విషయాల్లో… అధికారులు కఠినంగా వ్యవహిరంచాలని.. ఎలాంటి వారు ఉన్నా వదిలి పెట్టవద్దని ముఖ్యమంత్రి జగన్ అధికారులకు సూచించారు. సీఎం మీతో ఉన్నారని, ఈ విషయంలో మీరంతా దూకుడుగా ముందుకెళ్లాలని మద్యం, ఇసుక అక్రమ రవాణాపై కూడా ఉక్కుపాదం మోపాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. పద్దతి ప్రకారం మద్య నియంత్రణ చేస్తున్నామని, షాక్ కొట్టే రీతిలో మద్యం రేట్లు పెంచామని సీఎంగుర్తుచేశారు. ఇన్ని చేస్తున్న చేస్తున్నప్పుడు మద్యం అక్రమ రవాణా, తయారీ జరక్కుండా చూడాలన్సిన అవసరం ఉందన్నారు.
ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి మద్యం అక్రమ రవాణా జరగకూడదని తేల్చి చెప్పారు. ఏపీలో కొద్ది రోజులుగా ఇసుకతో పాటు మద్యం హాట్ టాపిక్ అవుతోంది. ఏపీలో సరిహద్దుల్లో తెలగాణ,తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. ఆయారాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున మద్యం ఏపీలోకి వస్తోంది. ఈ మేరకు వందల కేసులు నమోదవుతున్నాయి. పట్టుబడ్డవి కాకుండా.. పెద్ద ఎత్తున ఏపీలోకి వస్తున్నాయన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రభుత్వ మద్య నియంత్రణ లక్ష్యం దెబ్బతింటోంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ సీరియస్గా తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.
అలాగే ఇసుక కొరత కూడా.. ఏపీ ప్రజల్ని వెంటాడుతోంది. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా.. ఇసుక విషయంలో విమర్శలు చేస్తున్నారు. దీంతో.. దీనిపైనా దృష్టి పెట్టాలని జగన్ ఆదేశించారు. అధికారంలో ఉన్నందున ఇలాంటి వాటిలో వైసీపీ నేతల ప్రమేయం ఎక్కువగా ఉందని విమర్శలొస్తున్నందున.. అధికారులకు..తానున్నానని జగన్ భరోసా ఇచ్చి కట్టడి చేయమని సూచించినట్లుగా చెబుతున్నారు.