అధికారంలోకి వచ్చేస్తున్నాం అనే ధీమాతో ఉన్నాయి వైకాపా వర్గాలు! అంతేకాదు, దీనికి సంబంధించిన లెక్కలు కూడా కొంతమంది వైకాపా నాయకులు వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాలు వైకాపాకి మైనస్ అయ్యాయి. అక్కడ కేవలం 5 సీట్లు మాత్రమే వచ్చాయి. ఈసారి ఆ జిల్లాలపై జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారనీ… కాబట్టి, అధికారం తమదే అనే కోణంలో ఓ చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో… ఒక ముఖ్యనేతతో జగన్ స్వయంగా, ఆఫ్ ద రికార్డ్ కొన్ని వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం!
‘పదహారు నుంచి ఇరవై స్థానాలు మనం గోదావరి జిల్లాల్లో దక్కించుకుంటే, మనం వచ్చేసినట్టే అన్నా’ అంటూ ఒక నాయకుడితో జగన్ చెప్పారట! ఇదే సమయంలో గుంటూరు, కృష్ణా జిల్లాలు ఈసారీ వైకాపాకి అనుకూలంగా ఉండకపోవచ్చనే అభిప్రాయం జగన్ ఉందనీ, కాబట్టి రాబోయే పదిహేను రోజులపాటు వ్యూహాత్మకంగా పనిచెయ్యాలని నేతలకు చెప్పారట! ఉత్తరాంధ్ర ఫర్వాలేదని అన్నారట. ఇక, రాయలసీమ విషయంలో ఈసారి జగన్ మరింత ధీమాగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో గతం కంటే ఎక్కువ సీట్లు వస్తాయన్న ధీమాతో జగన్ ఉన్నారట! దానికి కారణమూ లేకపోలేదు. రాయలసీమ ప్రాంతంలో రాజధాని లేకపోవడం వల్లనే మనం అభివృద్ధి చెందలేకపోతున్నామనే ఒక చర్చను వైకాపా ప్రజల్లోకి తీసుకెళ్తోందనీ, ఈసారి జగన్ ముఖ్యమంత్రి కాకపోతే మన ప్రాంతం పూర్తిగా నిర్లక్ష్యానికి గురౌతుందనే అభిప్రాయాన్ని కింది స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ అంచనాల ప్రకారమే ఉభయ గోదావరి జిల్లాల్లో ఓ ఇరవై వస్తే చాలన్న అభిప్రాయం జగన్ ఉందని అంటున్నారు.
ప్రతీ పార్టీకీ గెలుపునకు సంబంధించిన సొంత లెక్కలూ ధీమాలు ఉండటం సహజం. వైకాపా కూడా అదే లెక్కల్లో ఉంది. అయితే, రాజధానికి సంబంధించి… తమ ప్రాంతంలో లేకపోవడం వల్లనే అభివృద్ధి కాలేదని రాయలసీమలో చర్చనీయం చేసే పనిలో వైకాపా ఉందన్న అంశాన్ని ఒక్కసారి విశ్లేషించాలి! అమరావతిలో ఒక్క ఇటుక అయినా పడలేదంటూ, అభివ్రుద్ధి ఊసే లేదంటూ ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో జగన్ విమర్శలు చేస్తున్నారు కదా! మరి, రాయలసీమకు వెళ్లేసరికి… రాజధాని అటువైపు ఉంది కాబట్టే అభివృద్ధి జరిగిందనే అభిప్రాయాన్ని కల్పిస్తున్నారట కదా! అంటే, టీడీపీ హయాంలో అభివృద్ధి జరిగిందని ఆయనే చెప్తున్నట్టు అవడం లేదా? రాజధాని గురించి ఆయనే రెండు రకాలుగా మాట్లాడుతున్నారనే అభిప్రాయాన్ని ఆ ప్రాంత ప్రజలకు కల్పిస్తున్నట్టుగా లేదా? ప్రాంతీయంగా భావోద్వేగాలతో లాభం పొందడం కోసమే సీమలో ఈ రాజధాని అంశాన్ని జగన్ వాడుకుంటున్నట్టు ప్రజలకు అర్థం కావడం లేదని అనుకుంటున్నారా..?