ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఇడుపులపాయ నుంచి లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా జరిగిన ప్రారంభ సభలో జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. యథాప్రకారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై విమర్శలకే తన ప్రసంగంలో పెద్దపీట వేశారు. తనకున్న కసిని కొత్తగా చెప్పే ప్రయత్నం చేశారు. ‘నా కసి ఏంటో తెలుసా.. చనిపోయిన తరువాత కూడా ప్రతి పేదవాడి గుండెల్లో బతకడమే నా కసి. విడిపోయిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రత్యేక హోదా ఒక్కటే సంజీవని అని కసిగా నమ్ముతున్నాను. హోదా తేవాలన్న కసి నాలో ఉంది. రైతులకు వ్యవసాయం మళ్లీ పండుగ చేయాలనే కసి నాలో ఉంది. అధికారంలోకి వచ్చిన తరువాత మూడు నాలుగేళ్లలో మద్యపానం పూర్తిగా తీసేయ్యాలనే కసి ఉంది. ప్రతీ కుటుంబంలో ఆప్యాయతలు పెంచాలన్నది నా కసి. ప్రతీ పేద విద్యార్థినీ చదివించి డాక్టర్లు చేయాలి, ఇంజినీరు చేయాలన్నది నాకున్న కసి. అవినీతి ఆంధ్ర నుంచి అభివృద్ధి ఆంధ్రాగా రాష్ట్రాన్ని మార్చాలన్నది నా కసి’ అంటూ మాట్లాడారు. దేవుడు ఆశీర్వదించి, మీ దీవెనలన్నీ తోడు ఉంటే ఒక సంవత్సరంలో మన ప్రభుత్వం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ పరిపాలన రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని జగన్ చెప్పారు.
ఇక, చంద్రబాబుపై విమర్శల విషయానికొస్తే… నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో చెప్పినవే మళ్లీ చెప్పారు. తనకు ప్రజలు ఇస్తున్న ధీమా వల్లనే ఇవాళ్ల చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరుగులెత్తే పరిస్థితి వచ్చిందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు అవుతున్నా రాష్ట్రానికి జరిగిన మేలు ఏదైనా ఉందని ప్రశ్నిస్తున్నా అన్నారు. చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఏ ఒక్క కుటుంబమైనా సంతోషంగా ఉందా అని అడుగుతా ఉన్నా అని ప్రశ్నించారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో గ్రామస్థాయి నుంచి రాజధాని వరకూ చేయని అక్రమాలు లేవు, అరాచకాలు లేవని ఆరోపించారు. నాలుగేళ్ల చంద్రబాబు నాయుడు పాలనలో చెల్లెళ్లు, అక్కలు, తాతలు, అవ్వలు, తమ్ముళ్లూ అందరూ మోసపోయారని జగన్ చెప్పారు. చంద్రబాబు లాంటి మోసగాడు దేశ చరిత్రలోనే ఎవ్వరూ ఉండరూ అనే మాట ఇప్పుడు వినిపిస్తోందన్నారు.
చంద్రబాబు పాలనలో మోసపోయిన ప్రజలందరికీ భరోసా కల్పించాలన్న ఉద్దేశంతోనే పాదయాత్ర మొదలుపెడుతున్నా అని చెప్పారు. ఈ ఆరు నెలలూ తనకు ప్రజలు ఇచ్చిన సలహాలూ సూచనలూ తీసుకుని ఎన్నికల మేనిఫెస్టో రూపొందిస్తా అన్నారు. పేజీలకు పేజీలు కాకుండా, కేవలం రెండు పేజీల్లోనే వైకాపా మేనిఫెస్టో ఉంటుందన్నారు. అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీల అమలు మొదలుపెడతాననీ, చెప్పినవాటితోపాటు చెప్పని ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి, మళ్లీ 2024లో ప్రజల ముందు ఓట్లు అడిగేందుకు వస్తానని అన్నారు. తరువాత.,. ఆంధ్రప్రదేశ్ సర్కారుకు ఉన్న అప్పులు, రైతులకు అందిన రుణమాఫీ, తగ్గుతున్న సాగు విస్థీర్ణం, రాజధాని రైతుల సమస్యలు, ఫిరాయింపు నేతలతో రాజీనామాలు చేయించకపోవడం… ఈ అంశాలన్నిటిపైనా యథావిధిగా జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వోద్యోగులకు ఇళ్లు, స్థలాలు ఇచ్చేస్తానంటూ హామీ ఇచ్చారు.
సో.. ఓవరాల్ గా పాదయాత్ర చేస్తున్నది మేనిఫెస్టో రూపకల్పనకు అన్నట్టుగా మరోసారి చెప్పారు. దీంతోపాటు, నాలుగేళ్ల చంద్రబాబు పాలనపై విసిగిపోయిన ప్రజలకు భరోసా ఇచ్చేందుకు బయలుదేరుతున్నట్టు చెప్పారు. అంతిమంగా… మరో ఏడాదిలో మన ప్రభుత్వం వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతోపాటు తనకున్న కసి ఏంటో అనేది వివరించడం విశేషం! చంద్రబాబు నాయుడు పాలనపై వ్యతిరేకతనే పాదయాత్రకు ప్రాతిపదిక అన్నట్టుగా జగన్ ప్రారంభోపన్యాసం సాగింది.