ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా… రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు ఏడాదికి రూ. పదివేలు అందించే పథకాన్ని నేడు ప్రారంభించనున్నారు. దీనికి జగనన్న చేదోడు అని పేరు పెట్టారు. కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న రజక, నాయీబ్రాహ్మణ, టైలర్లను ఆదుకుంటానని.. వారికి ఏటా పదివేల సాయం చేస్తానని.. జగన్ పాదయాత్రలో హామీ ఇచ్చారు. ఈ పథకంలో భాగంగా మొత్తం 2,47,040 మంది లబ్దిదారులకు రూ.247.04 కోట్ల ఆర్దిక సాయం అందించనున్నారు. డబ్బును నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి జమ చేస్తారు.
ఇప్పటికే లబ్దిదారుల ఎంపిక పూర్తయింది. వాలంటీర్ల ద్వారా ఎంపిక చేశారు. వారి బ్యాంక అకౌంట్లు ఇతర లాంఛనాలు పూర్తి చేశారు. పాత అప్పులకు జమ చేసుకోలేని విధంగా ముందుగానే బ్యాంక్‌లతో మాట్లాడి లబ్దిదారుల అన్‌ఇన్‌కంబర్డ్ అకౌంట్లకు ఈ నగదు జమ చేయస్తారు. 1,25,926 మంది టైలర్లు, 38,767 మంది నాయీబ్రాహ్మణులు, 82,347 మంది రజకులకు సాయం అందుతుంది. చేతి పెట్టుబడి కోసం ఈ ఆర్దిక సాయాన్ని వినియోగించుకుని వారి జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకుంటారని ప్రభుత్వం ఆశిస్తోంది.
అయితే.. మూడు విభాగాల్లోనూ లబ్దిదారులు అతి తక్కువగా ఉండటం మాత్రం.. ఆయా వర్గాల వారిలో అసతృప్తికి కారణం అవుతుంది. రాష్ట్రం మొత్తం మీద టైలర్లు కేవలం 38వేల మంది ఉన్నట్లుగానే ప్రభుత్వం చెబుతోంది. అలాగే టైలర్లు లక్షా ఇరవై ఐదు వేల మంది రజకులు 82వేల మంది మాత్రమే ఉన్నట్లుగా లెక్క తేల్చడంతో.. ఆయా వర్గాల వారిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కార్మిక శాఖ వద్ద రిజిస్టర్ చేసుకోవాలనే నిబంధన పెట్టడంతో… దాదాపుగా 70 శాతం మంది పథకానికి అనర్హులయ్యారని అంటున్నారు. ఈ నిబంధన మారిస్తే పథకం ఉద్దేశం నెరవేరుతుందని చెబుతున్నారు.